హైదరాబాద్ లోని చారిత్రిక కుతుబ్ షాహీ సమాధుల నిర్మాణం వెనుక ఖగోళ రహస్యం దాగుందా? అంతరిక్షంలో నక్షత్రాల అమరికకు, ఈ సమాధుల స్థానాలకు సంబంధం ఉందా? ఉందనే అంటున్నారు చారిత్రక పరిశోధకులు, అంతరిక్ష అధ్యయనశీలి, నిజాం కుటుంబానికి అత్యంత సన్నిహితులైన పైగా కుటుంబాలకు చెందిన ఒక వ్యక్తి.

మహ్మద్ హబీబ్ అనే అ ఖగోళ వ్యవహారాల అధ్యయనశీలి ప్రకారం అంతరిక్షంలోని నక్షత్ర మండలం ఉర్సుల మైనర్ కు, ఈ సమాధుల ఏర్పాటుకు సంబంధం ఉంది. ఆకాశంలోని అద్భుత అమరికకు అనుగుణంగానే ఈ సమాధులను ఏర్పాటుచేశారన్నది ఆయన వాదన. ఇప్పటి వరకూ నాలుగు సమాధులు ఒక వరసలో ఉండి, మిగతా మూడూ వేరొక చోట ఉండానికి స్థలం ఇరుకు కావడమే కారణమని చెబుతున్నారు. మహ్మద్ కుతుబ్ షా, హయత్ బక్ష్్ బేగమ్, అబ్దుల్లా కుతుబ్ షాహ్ ల సమాధులు మిగతా సమాధులకన్నా దూరంగా ఉంటాయి. ఈ సమాధులన్నీ బాగె సఫా అన్న తోటలో ఉంటాయి. హబీబ్ వాదన ప్రకారం నక్షత్రాల అమరిక ఆధారంగానే ఇలా జరిగింది తప్ప, స్థలాభావం వల్ల కాదు.

ఉర్సులా మైనర్ అన్న నక్షత్ర మండలంలో పోలారిస్, ఫేర్కడ్, కొచబ్, ఎప్సిలాన్ ఉర్సులా మైనారిస్, అక్ఫా అల్ ఫర్కదై్ అనే నక్షత్రాలుంటాయి. ఒక్కొక్క సమాధిపై ఒక్కొక్క నక్షత్రం ఉండేటట్లుగా ఈ సమాధులను ఏర్పాటు చేశారని హబీబ్ వాదిస్తున్నారు. అబ్దుల్లా కుతుబ్ షా సమాధిపై పోలారిస్, హయత్ బక్ష్ బేగమ్ సమాధిపై యిల్దున్ నక్షత్రం, మహ్మద్ కుతుబ్ షా సమాధిపై ఎప్సిలాన్, సుల్తాన్ కుత్బుల్ ముల్క్ సమాధిపై అన్వర్ అల్ ఫర్కదైన్, మహ్మద్ లుకీ కుతుబ్ షా్ సమాధిపై అఖ్ఫా అల్ ఫర్కడైన్, ఇబ్రహీం కుతుబ్ షాహ్ సమాధిపై కోచాబ్, జంషేద్ కుతుబ్ షాహ్ సమాధిపై ఫేర్కాడ్ నక్షత్రాలు ఉన్నాయని ఆయన అంటున్నారు. ఎనిమిదో సమాధికి నక్షత్రం ఆనుసంధానం జరగలేదు. ఎందుకంటే అది దత్తత తీసుకున్న రాజుది కాబట్టి అని హబీబ్ వాదిస్తున్నారు.

హబీబ్ వాదన పట్ల చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. కానీ మరి కొంత మంది మాత్రం బోలెడన్ని ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. వారికి కూడా సమాధానాలు చెప్పేందుకు హబీబ్ ఇప్పుడు మరిన్ని పరిశోధనలు చేస్తున్నారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.