స్టాఫ్‌నర్స్‌కి లైంగిక వేధింపులు.. క్రూర మృగంలా ప్రిన్సిపాల్‌

By అంజి  Published on  4 Feb 2020 3:59 AM GMT
స్టాఫ్‌నర్స్‌కి లైంగిక వేధింపులు.. క్రూర మృగంలా ప్రిన్సిపాల్‌

కామారెడ్డి జిల్లాలో మరో లైంగిక వేధింపుల ఘటన వెలుగులోకి వచ్చింది. పేరుకు విద్యార్థులకు పాఠాలు బోధించే గురువు.. చేసేవి మాత్రం పాడు పనులు. విద్యార్థులకు మంచి బుద్దులు నేర్పాల్సింది పోయి.. సిబ్బంది పట్ల ప్రిన్సిపాల్‌ వ్యవహరించిన తీరుకు హద్దులు లేకుండా పోయాయి. రోజుకు రోజుకు ఆకతాయిలతో పాటు చదువుకున్న వారి ఆగడాలు కూడా పెరిగిపోతున్నాయి. ఎప్పుడు ఎవరు ఎలా ప్రవర్తిస్తారో తెలియక మహిళలు నరకయాతన అనుభవిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలోని మద్నూర్‌ బాలుర గురుకుల పాఠశాల ప్రిన్సిపల్‌ శ్రీనివాస్‌ తనను లైంగిక వేధింపులకు గురి చేశాడని ఓ మహిళ మద్నూర్‌ పోలీస్‌స్టేషన్‌ ఫిర్యాదు చేసింది.

పాఠశాలలో స్టాఫ్‌నర్స్‌గా విధులు నిర్వహిస్తున్న తనను శ్రీనివాస్‌ లైంగికంగా, మానసికంగా వేధిస్తున్నాడని ఉద్యోగిని సునీత తన ఫిర్యాదులో పేర్కొంది. తన కామ వాంఛ తీర్చాలని.. లేదంటే విధుల నుంచి తొలగిస్తానని బెదిరిస్తున్నాడని బాధితురాలు వాపోయింది. తనతో గతంలో ఓ సారి కారులో లిఫ్ట్‌ ఇస్తానని చెప్పి కారు ఎక్కించుకొని అసభ్యకరంగా ప్రవర్తించాడని బాధితురాలు తెలిపింది. బలవంతంగా లొంగదీసుకునే ప్రయత్నం చేశాడని బాధితురాలు బోరున విలపించింది.

మూడు నెలల గర్భవతిని అని చెప్పినా కూడా వినకుండా తనపై శ్రీనివాస్‌ దాడికి ప్రయత్నించాడని పోలీసులకు తెలిపింది. పాఠశాలలో తనతో పాటు మరికొందరిని కూడా శ్రీనివాస్‌ ఇబ్బందులకు గురిచేస్తున్నాడని.. అయితే వారు భయంతో బయటకి చెప్పుకోలేకపోతున్నారని సునీత పేర్కొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని స్థానిక ఎస్సై సురేశ్‌ తెలిపారు.

Next Story
Share it