ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని బావించా
By తోట వంశీ కుమార్ Published on 3 May 2020 5:20 AM GMTభారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ తన జీవితంలో ఓ దశలో ఆత్మహత్య చేసుకోవాలని భావించినట్లు షాకింగ్ విషయాన్ని వెల్లడించాడు. ఇలా ఓ సారి మాత్రమే కాదని.. తనకు మూడు సార్లు ఇలాంటి ఆలోచననే వచ్చిందన్నాడు. అయితే.. కుటుం సభ్యుల మద్దతుతోనే ఆ ఆలోచనలోంచి బయటపడ్డానని చెప్పాడు.
కరోనా కారణంగా భారత క్రికెటర్లు ప్రస్తుతం ఇళ్లకే పరిమితం అయ్యారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. తాజాగా హిట్‌మ్యాన్ రోహిత్ శర్మతో కలిసి మహ్మద్ షమీ ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా షమీ.. వ్యక్తిగత, క్రికెట్ కెరీర్ సంబంధించిన సమస్యలతో మూడు సార్లు ఆత్మహత్య చేసుకోవాలని అనిపించినట్లు చెప్పుకొచ్చాడు.
2018లో షమీ భార్య హసిన్ జహాన్.. షమీతో పాటు అతడి సోదరుడిపై గృహ హింస కేసు పెట్టింది. దీంతో పాటు మ్యాచ్ ఫిక్సింగ్ సైతం పాల్పడ్డాడని సంచలన ఆరోపణలు చేసింది. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై విచారణ జరిపిన బీసీసీఐ అవినీతి నిరోధక శాఖ అధికారులు షమీకి క్లీన్ చిట్ ఇచ్చారు. ఇదే సమయంలో రోడ్డు ప్రమాదంలో షమీ గాయపడ్డాడు. ఆ సమయంలో తాను మానసికంగా అనుభవించిన వేదనను రోహిత్‌తో పంచుకున్నాడు షమీ.
'నా భర్య నా పై గృహహింస కేసు పెట్టడంతో కుటుంబ సమస్యలు ప్రారంభం అయ్యాయి. అదే సమయంలో నాకు యాక్సిడెంట్ అయ్యింది. అది కూడా ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) ప్రారంభానికి 10-12 రోజులు ముందు. నా వ్యక్తిగత విషయాలు మీడియాలో హల్ చల్ చేశాయి. ఆ సమయంలో వ్యక్తిగత సమస్యల కారణంగా మానసిక వేదనకు గురై మూడు సార్లు ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన వచ్చింది. మేం 24వ అంతస్తులో ఉండేవాళ్లం. దీంతో నేను అక్కడి నుంచి కిందకి దూకేస్తానేమోనని కుటుంబ సభ్యులు భయపడేవారు. నా సోదరుడు 24 గంటల పాటు నాతో పాటే ఉండి నన్ను కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. అన్ని మరిచిపోయి క్రికెట్ పై దృష్టి సారించమని నా తల్లిదండ్రులు నన్ను ప్రోత్సహించారు. వారంతా నా మంచి కోసం చెబుతున్నారని భావించి డెహ్రాడూన్ అకాడమీలో నా ప్రాక్టీస్ పై దృష్టి పెట్టి చాలా శ్రమించానని' షమీ తెలిపాడు.
2015 వన్డే ప్రపంచకప్ సందర్భంగా గాయపడ్డాను. ఆ గాయం నుంచి కోలుకోవడానికి 18 నెలల సమయం పట్టింది. దీంతో మానసికంగా కుంగిపోయాయని.. అప్పుడు కూడా ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన వచ్చిందన్నాడు.