సారీ బదానీ భాయ్.. అంటూ అద్భుతమైన క్యాచ్‌ను గుర్తు చేసిన మొహమ్మద్ కైఫ్
By తోట వంశీ కుమార్ Published on 26 July 2020 6:54 AM GMTభారత జట్టు ఫీల్డింగ్ లెవెల్స్ పెరిగాయంటే అందుకు కారణం మొహమ్మద్ కైఫ్, యువరాజ్ సింగ్ లు కారణమని అంటారు. వారి క్యాచ్ లు, రన్ అవుట్ లు, డైవ్ చేసి పరుగులను నియంత్రించడాలు.. ఇలా చాలా విషయాల్లో వారు 'ది బెస్ట్' గా నిలవడమే కాకుండా.. ఎంతో మంది యువతకు ఆదర్శంగా నిలిచారు.
మొహమ్మద్ కైఫ్ తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన క్యాచ్ పట్టుకుని ఉంటాడు. కానీ 2004 లో పాకిస్థాన్ తో జరిగిన సిరీస్ లో కరాచీ వన్డేలో పట్టిన రన్నింగ్ క్యాచ్ ను భారత్ క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మరచిపోరు. అద్భుతంగా రన్నింగ్ చేసుకుంటూ వచ్చి.. ఇంకో ఫీల్డర్ ఎక్కడ అడ్డుపడతాడో అన్న భయం ఏ మాత్రం లేకుండా.. క్యాచ్ పట్టాలి, భారత్ ను గెలిపించాలి అన్నదే మొహమ్మద్ కైఫ్ లక్ష్యం ఆ రోజు.. అనుకున్నది చేసి చూపించాడు కైఫ్. అద్భుతమైన క్యాచ్ ను భారత అభిమానులు, మొహమ్మద్ కైఫ్ ఎప్పటికీ మరచిపోడు.
"Fearlessness of youth makes you chase the impossible and grab it with both hands." అంటూ ఆ క్యాచ్ కు సంబంధించిన వీడియో తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నాడు కైఫ్. ఆ వీడియోలో క్యాచ్ పట్టుకోడానికి హేమంగ్ బదానీ కూడా ప్రయత్నిస్తాడు. హేమంగ్ బదానీ డైవ్ చేసి మరీ క్యాచ్ ను అందుకోవాలని ప్రయత్నిస్తున్న సమయంలో కైఫ్ అమాంతం రన్నింగ్ చేసుకుంటూ వచ్చి క్యాచ్ ను పట్టేస్తాడు. అందుకే మొహమ్మద్ కైఫ్ 'సారీ బదానీ భాయ్' అని తెలిపాడు.
2004 లో అయిదు మ్యాచ్ ల వన్డే సిరీస్ కోసం భారత్ పాకిస్థాన్ కు వెళ్ళింది. సిరీస్ మొదటి మ్యాచ్ లో భారత్ కేవలం 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచిన పాకిస్థాన్ భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. భారత్ కు అద్భుతమైన ఆరంభాన్ని వీరేంద్ర సెహ్వాగ్ ఇచ్చాడు. 57 బంతుల్లో 79 పరుగులు సెహ్వాగ్ కొట్టాడు. ద్రావిడ్ 104 బంతుల్లో 99 పరుగులు చేయగా, గంగూలీ 45, కైఫ్ 46 పరుగులతో రాణించడంతో భారత్ 349 పరుగులు సాధించింది.
పాకిస్థాన్ 8 ఓవర్లలో 34 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయినప్పటికీ మొహమ్మద్ యూసుఫ్ తో కలిసి ఇంజమామ్ ఉల్ హక్ అద్భుతమైన భాగస్వామ్యాన్ని నమోదు చేస్తాడు. 122 పరుగులు చేసిన ఇంజమామ్ పాక్ కు విజయాన్ని దగ్గరకు చేశాడు. అబ్దుల్ రజాక్ 27 పరుగులు కూడా భారత్ ను టెన్షన్ పెట్టాయి. 8 బంతుల్లో 10 పరుగులు కావాల్సిన సమయంలో షోయబ్ మాలిక్ బంతిని గాల్లోకి ఎత్తగా.. మొహమ్మద్ కైఫ్ ఈ అద్భుతమైన క్యాచ్ ను అందుకుని భారత్ విజయావకాశాలను దగ్గర చేశాడు. షోయబ్ మాలిక్ అవుట్ అవ్వగానే కొత్త బ్యాట్స్మెన్ క్రీజులోకి రావడంతో పాకిస్థాన్ ఆఖరి ఓవర్ లో తొమ్మిది పరుగులు చేయాల్సి వచ్చింది. కానీ ఒత్తిడి ఎక్కువవడంతో పాకిస్థాన్ ఆటగాళ్లు లక్ష్యాన్ని చేధించలేకపోయారు. ఆ సిరీస్ మొత్తానికి మొహమ్మద్ కైఫ్ పట్టిన ఈ క్యాచ్ ఎంతో హైలైట్ గా నిలిచింది.