యూపీ సర్కార్‌ పోరాడుతున్న తీరుకు ఇది నిదర్శనం: మోదీ

By సుభాష్  Published on  26 Jun 2020 3:30 PM IST
యూపీ సర్కార్‌ పోరాడుతున్న తీరుకు ఇది నిదర్శనం: మోదీ

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ పట్టిపీడిస్తోంది. ప్రపంచ దేశాలను సైతం వణికిస్తున్న కరోనా భారత్‌లో చాపకింద నీరులా వ్యాపించింది. ఈక్రమంలో సొంత రాష్ట్రాలకు తిరిగి వచ్చిన వలస కార్మికుల ఉపాధి కల్పించే ఉద్దేశంతో రూపొందించిన 'ఆత్మనిర్భర్‌ ఉత్తరప్రదేశ్‌ రోజ్‌గార్‌ అభియాన్‌' ను ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా యూపీలోని ఆరు జిల్లాల ప్రజలతో వీడియో కాన్ఫరెన్స్‌ లో మోదీ మాట్లాడారు. ఈ పథకం ద్వారా స్థానికంగా దాదాపు 1.25 కోట్ల మందికి లబ్దిచేకూరనుందని యూపీ అధికారులు తెలిపారు.

మరోవైపు కరోనాపై యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం అనుసరిస్తున్నతీరుపై మోదీ ప్రశంసలు కురిపించారు. యూపీ సర్కార్‌ అనుసరిస్తున్న విధానాలు స్ఫూర్తిదాకయమని అన్నారు. ఒకప్పుడు ప్రపంచ దేశాలను జయించి, అతిపెద్ద శక్తులుగా ఎదిగిన ఇంగ్లండ్‌, ఫ్రాన్స్‌, ఇటలీ, స్పెయిన్‌ తదితర యూరప్‌ దేశాల జనాభా మొత్తం కలిపి 24 కోట్లు. ఇది ఉత్తరప్రదేశ్‌ జనాభాకు సమానం. కరోనా కారణంగా ఈ దేశాల్లో దాదాపు లక్షా 30వేల మంది మృతి చెందగా, ఉత్తరప్రదేశ్‌లో కేవలం 600 మంది మాత్రమే కరోనా బారిన పడ్డారని అన్నారు. యూపీ సర్కార్‌ కరోనా మహమ్మారిపై పోరాడుతున్న తీరుకు ఇది నిదర్శనమంటూ మోదీ ప్రశంసించారు. కరోనాకు వ్యాక్సిన్‌ లేని కారణంగా ప్రతి ఒక్కరు మాస్కులు ధరిస్తూ సోషల్‌ డిస్టెన్స్‌ పాటించడమే మార్గమని అన్నారు. కరోనా నుంచి రక్షణ పొందేందుకు ఎవరికి వారే జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో కరోనా కేసులు చాలా తక్కువగా ఉన్నాయని అన్నారు.

Next Story