ఏప్రిల్‌ 15కు లాక్‌డౌన్‌ ముగుస్తుందా..?

By సుభాష్  Published on  2 April 2020 1:43 PM GMT
ఏప్రిల్‌ 15కు లాక్‌డౌన్‌ ముగుస్తుందా..?

కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా పట్టిపీడిస్తోంది. కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించగా, ప్రతీ ఒక్కరు కూడా తమ తమ ఇళ్లకే పరిమితం అయ్యారు. తాజాగా గురువారం ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏప్రిల్‌ 15న లాక్‌డౌన్‌ ఎత్తివేస్తారా..? లేదా అనే సందేహం అరుణాచల్‌ ముఖ్యమంత్రి, బీజేపీ నేత పేమాఖండూ చేసిన ట్వీట్‌ సమాధానంగా మారిందనే చెప్పాలి.

21 రోజుల లాక్‌డౌన్‌ వృధా కాదని భావిస్తున్నానని, లాక్‌డౌన్‌ తర్వాత కూడా కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు అన్ని జాగ్రత్తలు పాటించాలని మోదీ చెప్పినట్లు సీఎం ట్వీట్‌ చేశారు. అందరూ బాధ్యతతో ఉండాలని మోదీ సూచించినట్లు ఆయన చెప్పుకొచ్చారు.

సీఎంతో మోదీ ఏం చర్చించారు..

ఇదిలాఉంటే లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత ఏం చేయాలనే విషయాలపై ముఖ్యమంత్రులతో మోదీ చర్చించారు. కరోనా వ్యాప్తిపై పోరాడడానికి 21 రోజుల లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత జనాలు రోడ్లపైకి వచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా సిద్ధం కావాలనే దానిపై మోదీ చర్చించినట్లు తెలుస్తోంది.

లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత భద్రతపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ముఖ్యమంత్రులకు మోదీ పలు సూచనలు చేశారు. తర్వాత జనాల కదలికలపై గమనించాలని సూచించారు. మొత్తం మీద లాక్‌డౌన్‌ ఎత్తివేత గురించి మోదీ స్పష్టత ఇవ్వకపోయినా.. అరుణాచల్‌ సీఎం ట్వీట్‌ చూస్తుంటే ఎత్తివేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

అయితే అరుణాచల్‌ సీఎం ట్వీట్‌ చేసిన కొద్దిసేపటికే దానిని తొలగించారు. హిందీ భాష సరిగ్గా అర్థం కాని ఓ అధికారి ఈ ట్వీట్‌ను పోస్టు చేశారని, ఆ కారణంగానే దీనిని తొలగిస్తున్నట్లు పెమా ఖాండూ వివరణ ఇచ్చుకున్నారు.

ఇక ఏప్రిల్‌ 15 నుంచి రైల్వే టికెట్లు, విమాన టికెట్లు బుకింగ్‌ను ప్రారంభిస్తున్నారనే వార్తలను చూస్తుంటే లాక్‌డౌన్‌ను ఎత్తివేసే సంకేతాలు కనిపిస్తున్నాయి. కాగా, ప్రభుత్వం తరపున లాక్‌డౌన్‌ ఎత్తివేయడంపై గానీ, ప్రజారవాణాకు అనుమతి విషయంలో గానీ ఎలాంటి సమాచారం లేదు.





Next Story