అఖిలపక్ష భేటీలో మాట్లాడిన మోదీ.. విపక్షాలపై పంచ్‌లు వేశారా?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 Jun 2020 7:11 AM GMT
అఖిలపక్ష భేటీలో మాట్లాడిన మోదీ.. విపక్షాలపై పంచ్‌లు వేశారా?

మేనేజ్ మెంట్ గురుకు ఏ మాత్రం తీసిపోని రీతిలో మాట్లాడే ప్రధాని మోదీ మాటలకు ఫిదా కానోళ్లు ఎవరు? ఆయన మాటలకున్న సమ్మోహన శక్తితో యావత్ దేశాన్ని ఏకం చేయటమే కాదు.. ఆయనేం చెబితే.. అది చేసిన వైనాన్ని మహమ్మారి విరుచుకుపడిన వేళ చూశాం. జాతి జనులంతా జనతా కర్ఫ్యూ పాటించాలని కోరితే.. దేశం మొత్తం బంద్ కావటమే కాదు.. మోడీ చెప్పిన టైంలో ఇంట్లో నుంచి బయటకు రావటానికి కూడా ఇష్టపడలేదు.

అంతలా తన మాటలతో ప్రభావితం చేసే మోడీ.. అవకాశం లభిస్తే..ఆయనలోని రాజకీయ నాయకుడు నిద్ర లేచే తీరు ఎలా ఉంటుందో తాజాగా మరోసారి స్పష్టమైందని చెప్పాలి. భారత సైనికుల పట్ల చైనా దురాగతంపై విపక్ష పార్టీలతో సమావేశమైన సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాటల్ని నిశితంగా చూస్తే.. తమ ప్రభుత్వం ఏం చేయనుందన్న విషయాన్ని స్పష్టం చేయటమే కాదు.. విపక్షాలకు పంచ్ లు వేసేందుకు వెనుకాడలేదన్న వాదన వినిపిస్తోంది. దీనికి ఆయన చేసిన వ్యాఖ్యలే నిదర్శనమంటున్న వారు లేకపోలేదు.

ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో విషయాన్ని విషయంగా చూపిస్తూ.. మాట్లాడితే సరిపోతుంది. కానీ.. అందుకు భిన్నంగా మోడీ మాట్లాడిన మాటల్లో కొన్నింటిని చూస్తే.. ఆయన తెగువకు ఆశ్చర్యపోవాల్సిందే. సాధారణంగా ఇలాంటి సమయాల్లో విపక్షాల సంఘీభావాన్ని కోరటం.. వారి నుంచి సలహాలు.. సూచనలు స్వీకరించటం.. తామేం చేయాలనుకుంటున్న విషయాన్ని చెబుతుంటారు. అందుకు భిన్నంగా గత ప్రభుత్వాల కంటే మిన్నగా తాము వ్యవహరించామన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు ఉండటం గమనార్హం. వీడియోకాన్ఫరెన్సులో నిర్వహించిన అఖిలపక్ష సమావేశాన్ని సైనిక అమరులకు నివాళులు అర్పించటంతో మొదలైంది. ఈ సందర్భంగా మాట్లాడిన మోడీ చేసిన కీలక వ్యాఖ్యల్ని చూస్తే..

  • ఇంతకు ముందు మన భూభాగంలోకి ఎవరు వచ్చినా.. అడిగేవారు కాదు. వారిని తరమడం గానీ, నిలువరించడం గానీ చేసేవారు కాదు. ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చాం.
  • ఇప్పుడు మన సైనికులు చొరబాట్లను అడుగడుగునా అడ్డుకుంటున్నారు. అందుకే సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరిగాయి. మన సైనికుల ధైర్యసాహసాలు భారత్‌ వైపు కన్నెత్తి చూసేవారికి ఓ పాఠంలాంటిది.
  • భారత్‌ ఎప్పుడూ పొరుగు దేశాలతో శాంతిని, స్నేహహస్తాన్ని కోరుకుంటుంది. అదే సమయంలో ఆత్మగౌరవాన్ని, దేశ సమగ్రతను కాపాడుకోవడంలో ఏమాత్రం రాజీ పడబోదు. దేశ సార్వభౌమాధికారమే మనకు ముఖ్యం.
  • దేశాన్ని కాపాడేందుకు ఏం చేయాలో.. భారత సైన్యం అదే చేస్తోంది. అందులో భాగంగానే మోహరింపు, చర్యలు, ప్రతిచర్యలకు సిద్ధమవుతోంది. మన భూభాగంపై కన్నెత్తి చూసిన వారికి గుణపాఠం చెప్పి మరీ, 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. వారి త్యాగం వృథా కాదు.
  • సరిహద్దుల్లో తీసుకుంటున్న చర్యల గురించి రానున్న రోజుల్లో సమయానుకూలంగా వెల్లడిస్తామని అన్నారు. గతంలో మనం దృష్టి సారించని ప్రాంతాల్లో కూడా ఇప్పుడు మన సైనికులు మోహరించాం.

Next Story