దేశ వ్యాప్తంగా కరోనా కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే 21 రోజుల పాటు మోదీ లాక్‌డౌన్‌ అమలుకు ఆదేశాలు ఇవ్వడంతో అన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. కరోనా విలయతాండవంతో పెద్ద ఎత్తున నష్టాలు కూడా జరుగుతున్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు కేంద్రం ముందస్తుగా అప్రమత్తమైన అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. పోలీసు బలగాలను రంగంలోకి దింపి జనాలు రోడ్లపైకి రాకుండా ఇళ్లకే పరిమితం అయ్యేలా చేశాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. కరోనా నివారణకు ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని ‘పీఎం కేర్స్‌ ఫండ్‌’ కు ఎంతో మంది విరాళాలు అందజేస్తున్నారు.

ఇక మోదీ తల్లి హీరాబెన్‌ తనవంతుగా రూ. 25వేల విరాళాన్ని అందజేశారు. ప్రస్తుతం మోదీ తల్లి గురాజత్‌.. గాంధీనగర్‌ సమీపంలోని రైసిన్‌ గ్రామంలో తన చిన్న కొడుకు పంకజ్‌ మోదీతో ఉంటోంది. ఆమె వయసు 98 సంవత్సరాలు. కరోనా కారణంగా రోగులకు సేవలందిస్తున్న వైద్యులను, వైద్య సిబ్బందిని అభినందిస్తూ ప్రజలంతా చప్పట్లు కొట్టాలని జనతా కర్ఫ్యూ సందర్భంగా మోదీ పిలుపునివ్వడంతో ఆమె కూడా వణుకుతున్న చేతులతో చప్పట్లు చొట్టారు. ఇక ‘కేర్స్‌ ఫండ్‌’ ఎంతో తోడ్పడుతుందని ఈ సందర్భంగా మోదీ ట్వీట్ చేశారు.

కాగా, ఈ నూతన పబ్లిక్‌ చారిటబుల్‌ ట్రస్టుకు మోదీ చైర్మన్‌ కాగా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, హోంశాఖ మంత్రి అమిత్‌షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ సభ్యులుగా ఉన్నారు. కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా వేలల్లో మరణించగా, లక్షలాది మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.