యువకులపై పోలీసుల జులూం (వీడియోతో)

By సుభాష్  Published on  31 March 2020 6:50 AM GMT
యువకులపై పోలీసుల జులూం (వీడియోతో)

కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విలయతాండవం చేస్తోంది. ఈ కరోనా వైరస్‌ కారణంగా వేలాది మంది మృతి చెందగా, లక్షల్లో చికిత్స పొందుతున్నారు. ఇక ఈ వైరస్‌ మనదేశంలో కూడా చాపకింద నీరులా విస్తరించడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై, అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కరోనాను ఎదుర్కొనేందుకు ఏప్రిల్‌ 14 వరకు లాక్‌డౌన్‌ ప్రకటిస్తూ అన్ని రాష్ట్రాలకు కేంద్ర సర్కార్‌ ఆదేశాలు జారీ చేసింది. దీంతో కేంద్రం పిలుపులో అన్ని రాష్ట్రాల్లో 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ అమలవుతోంది.

ఇక తెలంగాణలో కూడా లాక్‌డౌన్‌ అమలుతో ప్రజలెవ్వరూ బయటకు రాకుండా తమ తమ ఇళ్లకే పరిమితం అయ్యారు. లాక్‌డౌన్‌ సమయంలో ఎవరూ బయటకు రావద్దంటూ పోలీసులు సైతం చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసుల అత్యుత్సాహం కూడా ఎక్కువైపోయింది. కొందరి పోలీసుల అత్యుత్సాహం వివాదస్పదంగా మారుతోంది. ఎవరూ బయట కనిపించినా దారుణంగా చితకబాదుతున్నారు. ఈ లాక్‌డౌన్‌తో సామాన్యులకు తీవ్ర ఇబ్బందిగా మారిపోయింది. గ్రామాల్లో పొలాలకు వెళ్తున్న రైతులను సైతం పోలీసులు వదిలిపెట్టడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం చేసుకునే రైతులను ఎమనకుండా చూసీచూడనట్లు ఉండాలని సీఎం కేసీఆర్‌ పోలీసులకు సూచించినా.. అవేమి పట్టించుకోకుండా రైతులను దారుణంగా చితకబాదుతున్నారు.

Ts Police

మొన్న సూర్యపేటలో ఓ ఎస్సై రైతును దారుణంగా కర్రతో చితకబాదాడు. పొలం వద్దకు వెళ్తుండగా, అడ్డుకుని దారుణంగా కొట్టడం వివాదస్పదంగా మారింది. నేడు మరో ఘటన చోటు చేసుకుంది. జనగామ జిల్లా చిల్పూర్‌ మండలం కొండాపురం గ్రామంలో సరదాగా ఇంటి ముందు పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తులపై పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. ఓ కానిస్టేబుల్‌ వాళ్ల చేతులను కాళ్లతో తొక్కి పట్టగా, మరో పోలీసు ఉన్నతాధికారి వారిని దారుణంగా చితకబాదడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అంతేకాదు వారిని లం.. కొ.. కా .. అంటూ అసభ్యకరంగా తిడుతూ దారుణంగా ప్రవర్తించారు. సదరు యువకులు తమను కొట్టవద్దని, దండం పెడుతూ ఎంత బతిమిలాడినా.. పోలీసులు ఏ మాత్రం కనికరించలేదు. వాళ్ల పని వాళ్లు కానిచ్చారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసుల తీరుపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. పోలీసులు ఇంత దారుణంగా ప్రవర్తించడం సరైంది కాదంటూ అక్రోశం వెళ్లగక్కుతున్నారు.

[video width="640" height="352" mp4="https://telugu.newsmeter.in/wp-content/uploads/2020/03/WhatsApp-Video-2020-03-31-at-11.06.11-AM.mp4"][/video]

Next Story