ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి పట్టిపీడిస్తోంది. చిన్న పిల్లల నుంచి వృద్దుల వరకు ఎవ్వరిని వదలడం లేదు. కరోనా ఎఫెక్ట్‌తో దేశ వ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా దీనిని పటిష్టంగా అమలు చేసేందుకు ఆయా రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం జనసాంద్రత దృష్ట్యా రాబోయే రోజుల్లో కరోనా బాధితుల సంఖ్య 5 లక్షలకు చేరే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏ మాత్రం అజాగ్రత్త వహించినా భారీ నష్టం జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. అందుకు పోలీసులు, అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.

ఎవరైనా రోడ్లపైకి వస్తే చితకబాదుతున్నారు. అయితే 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ సరిపోదని, మరిన్ని రోజులు లాక్‌డౌన్‌ విధిస్తేనే ఫలితం ఉంటుందని నిపుణుల సూచన మేరకు ప్రధాని నరేంద్రమోదీ మరిన్ని రోజులు పొడిగించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఏప్రిల్‌ 15 వరకు ఉన్న లాక్‌డౌన్‌ అమలును మరిన్ని రోజులు పొడిగించే అవకాశాలు లేకపోలేదని డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ కార్యాలయ ఉన్నతాధికారులు చెబుతున్నారు.

అజాగ్రత్త వహిస్తే అమెరికా, ఇటలీల్లో జరుగుతున్న దుష్ఫరిణామాలు భారత్‌లో కూడా జరగకుండా ఉండేందుకు మోదీ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే భారత్‌లో కరోనా పాజిటివ్‌ల సంఖ్య 600లకుపైగా చేరుకుంది. 12 మంది మృతి చెందారు. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో మరిన్ని రోజులు పొడిగించేందుకు మోదీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.