ఇంటికి వెళ్లాలనుకోవడం మానవుడి సహజ లక్షణం: సీఎంల వీడియో కాన్ఫరెన్స్‌లో మోదీ
By సుభాష్ Published on 11 May 2020 2:49 PM GMTదేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో లాక్ డౌన్ కొనసాగుతోంది. కరోనాను కట్టడి చేసేందుకు మూడో దశ లాక్‌డౌన్ కొనసాగుతోంది. అయితే ఈనెల 17వ తేదీతో లాక్‌డౌన్ ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా మోదీ మాట్లాడుతూ.. కరోనాను తరిమికొట్టాలంటే అన్ని రాష్ట్రాలు పరస్పరం సహకరించుకుని పని చేయాలని పిలుపునిచ్చారు. వలస కార్మికులు సురక్షితంగా ఇంటికి చేరేలా తగిన చర్యలు తీసుకోవాలని మోదీ కోరారు. రాష్ట్రాల్లో అమలవుతున్న లాక్‌డౌన్, కరోనాపై కేసులపై చర్చించారు.
ఇంటికి వెళ్లాలనుకోవడం మానవుడి సహజ లక్షణం..
ప్రతి ఒక్కరూ ఇంటికి వెళ్లాలనుకోవడం మానవుడి సహజ లక్షణమని మోదీ అన్నారు. వలస కార్మికుల తరలింపులో రాష్ట్రాలు సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని అన్నారు. ఇదే సమయంలో కరోనా గ్రామాలకు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అప్రమత్తం చేశారు..ఏ ప్రాంతంలోనైనా సామాజిక దూరం పాటించడం తప్పని సరి అని అన్నారు.
కరోనాపై మనం విజయవంతం అయ్యాం..
కరోనాపై మనం విజయవంతం అయ్యామని ప్రపంచం మొత్తం కొనియాడుతోందని, ఈ కరోనా యుద్ధంలో రాష్ట్రాలదే కీలక పాత్ర అని అన్నారు. అన్ని రాష్ట్రాలు కూడా కరోనాను ధీటుగా ఎదుర్కొన్నాయి. కరోనా నుంచి కాపాడుకోవడానికి ఎక్కడివారు అక్కడే ఉండాలని మనం అప్రమత్తం చేశాం. కానీ ఇంటికి వెళ్లాలని అనుకోవడం మానవుని సహజ లక్షణం. అందుకే మన నిర్ణయాలను కొంత మేర మార్చుకున్నాం. ప్రస్తుతం ఈ మహమ్మారి గ్రామాలకు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవడం మన ముందున్న లక్ష్యం... అని మోదీ అన్నారు.
కాగా, దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం మార్చి 24వ తేదీ నుంచి లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మూడో దశ లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఈ లాక్‌డౌన్ మే 17వ తేదీతో ముగియనుంది. అయితే గ్రీన్ జోన్లు, ఆరెంజ్ జోన్లలో లాక్‌డౌన్ సడలింపులతో ప్రజల రాకపోకలు కొనసాగుతున్నాయి. కాగా, తాజాగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రులు సూచనలు, సలహాలు తీసుకున్న మోదీ మరోసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమై లాక్‌డౌన్‌పౌ చర్చించే అవకాశం ఉంది.