పాస్‌బుక్‌ కోసం లక్ష రూపాయల లంచం.. సిగ్గులేదా..

By అంజి
Published on : 26 Feb 2020 1:15 PM IST

పాస్‌బుక్‌ కోసం లక్ష రూపాయల లంచం.. సిగ్గులేదా..

అమరావతి: ప్రజాచైతన్యయాత్ర పేరుతో చంద్రబాబు ప్రజలను రెచ్చగొడుతున్నారని ప్రభుత్వవిప్‌, వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. మూడు సార్లు సీఎంగా చేసిన వ్యక్తి ఇలాగేనా వ్యవహరించేంది అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు అసైన్డ్‌ ల్యాండ్‌ గురించి మాట్లాడటం సిగ్గుచేటని, పేద ప్రజలకు ఒక్క గజం స్థలం అయినా పంచావా అని చంద్రబాబును నిలదీశారు. హంద్రీనీవాను కేవలం ఐదు టీఎంసీలకే పరిమితం చేశారని, హంద్రీనీవాలకు చంద్రబాబు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు.

రాయలసీమ ప్రాజెక్టుల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు ఏ మాత్రం లేదన్నారు. వైఎస్సాఆర్‌ తన ఐదేళ్ పదవీకాలంలో హంద్రీనీవా ప్రాజెక్టు జీఓలను చించేసి.. తిరిగి 40 టీఎంసీలకు పెంచుతూ అనంతపురం ప్రజలకు దేవుడిలా నిలిచారని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అనంతపురంలో హార్టికల్చర్‌ వచ్చిందంటే.. అది వైఎస్సార్‌ చలవేనన్నారు. 15 ఏళ్లు చంద్రబాబు గ్రాఫిక్స్‌తో కాలం గడిపారని శ్రీకాంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. సీఎం వైఎస్‌ జగన్‌పై ఎన్ని వ్యాఖ్యలు చేసినా మౌనంగా భరిస్తున్నామని, చంద్రబాబు నీచరాజకీయాలకు పాల్పడుతున్నారని అన్నారు.

చంద్రబాబు హయాంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై దాడులు జరిగాయని, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేలపై దాడులు చేస్తున్నారని ఎమ్మెల్యే శ్రీకాంత్‌ రెడ్డి ఫైర్‌ అయ్యారు. చంద్రబాబు నీచ సంస్కృతి మానుకుంటే మంచిదన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ సంక్షేమ పథకాల అమలులో చరిత్ర సృష్టిస్తున్నారని అన్నారు. పరిశ్రమలు వెళ్లిపోతున్నాయని దుష్ప్రచారం చేస్తారా.. దమ్ము, ధైర్యం ఉంటే చర్చకు రావాలని శ్రీకాంత్‌ రెడ్డి అన్నారు. బీసీలపై రిజర్వేషన్ల చంద్రబాబు మాట్లాడుతున్నారు.. నిజంగా ఈ అంశంపై కర్నూలు చెందని వ్యక్తితో పిల్‌ వేయించింది మీరు (చంద్రబాబు) కాదా అంటూ శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు.

మద్యపానం తగ్గించేలా చేయాల్సిన చంద్రబాబు.. దానిని తాగించేలా దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు. మద్యపానం నిషేధం దిశగా ప్రభుత్వం ముందుకెళ్తోంటే.. చంద్రబాబు ఎల్లోమీడియా దుష్ప్రచారం చేస్తోందన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందడాన్ని పచ్చదండు జీర్ణించుకోలేపోతోందని దుయ్యబట్టారు. చంద్రబాబు అక్రమ నిర్మాణంలో ఉంటూ నీతులు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. పాస్‌ బుక్‌ కోసం ఓ రైతు లక్ష రూపాయల లంచం టీడీపీ ప్రభుత్వం హయాంలో ఇచ్చానని చెప్పినా చంద్రబాబు సిగ్గుపడలేదంటే మీరే అర్థం చేసుకోవాలని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు.

Next Story