మానుకోట గులాబీలో విబేధాలు.. మంత్రిపై ధ్వజమెత్తిన ఎమ్మెల్యే
By అంజి Published on 27 Feb 2020 9:48 AM ISTముఖ్యాంశాలు
- మానుకోట గులాబీ పార్టీలో అంతర్గత విబేధాలు
- ఎస్సారెస్పీ సమీక్షా సమావేశంలో రసాభాస
- తాను ఎర్రబస్సు ఎక్కి రాలేదు: ఎమ్మెల్యే శంకర్ నాయక్
మహబూబాబాద్: మానుకోటలోని గులాబీ పార్టీలో అంతర్గత విబేధాలు మరోసారి బహిర్గతం అయ్యాయి. కలెక్టరేట్ నిర్వహించిన ఎస్సారెస్పీ సమావేశంలో ఎమ్మెల్యే శంకర్‌నాయక్ చేసిన కామెంట్స్ తీవ్ర కలకలం రేపాయి. దీంతో సమీక్షా సమావేశం రసాభాసగా మారింది. తాను రాకముందే సమావేశాన్ని ఎలా నిర్వహిస్తారంటూ మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంలో గిరిజనశాఖ మంత్రి సత్యవథి రాథోడ్, అధికారుల తీరును ఆయన తప్పుబట్టారు. మంత్రి సత్యవతి వారించిన.. ఎంతకు వినకపోవడంతో ఇద్దరి మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది.
బుధవారం నాడు మధ్యాహ్నం 12.30 గంటలకు మహబూబాబాద్ కలెక్టరేట్‌లో ఎస్సారెస్పీ సమీక్షా సమావేశం ప్రారంభమైంది. ఆ తర్వాత కాసేపటికి ఎమ్మెల్యే శంకర్ నాయక్ అక్కడికి చేరుకున్నారు. ఎమ్మెల్యే రాకుండానే సమావేశం ఎలా ప్రారంభిస్తారని అక్కడున్న అధికారులపై మండిపడ్డారు. ఇక్కడున్న స్థానిక సమస్యలు మీకు తెలుసా..?, సొంత డబ్బులతో కాలువలు నిర్మించాలా..? అని ప్రశ్నించారు. రెండు సంవత్సరాలు గడుస్తున్న ఎస్సారెస్పీ పనులు ఎందుకు ముందుకు సాగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తనపై అంత చిన్న చూపు చూపాల్సిన అవసరంలేదని.. తానేమి ఎర్రబస్సు ఎక్కి రాలేదన్నారు. ఆర్‌ఈసీలో చదివి రాజకీయాల్లోకి వచ్చానని మంత్రిపై పరోక్ష విమర్శలు గుప్పించారు. ఎదో పేరుకే సమీక్షా సమావేశాలు పెట్టి చాయ్, బిస్కెట్లు తిని ఫొటోలకు ఫోజులిస్తే ప్రయోజనం ఏం ఉండదని ఘాటుగా శంకర్‌నాయక్ మాట్లాడారు. స్థానిక సమస్యలపై మంత్రికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని విమర్శించారు.
మంత్రి సత్యవతి రాథోడ్ కలగజేసుకొని.. మనం ముందుగానే అనుకున్నాం కదా?, సమీక్ష గురించి తెలుసు కదా అంటూ సమాధానం ఇచ్చారు. అయితే తాను రాకుండానే సమావేశం ఎలా ప్రారంభించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ఇష్టమొచ్చినట్లు చేసుకోండి అంటూ శంకర్‌నాయక్ ధ్వజమెత్తారు. ఎందుకు రాద్దాంతం చేస్తున్నారని, మీ సమస్యలు ఎంటో చెప్పాలని చర్చిద్దామని మంత్రి సత్యవతి బదులిచ్చారు. అనంతరం మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ కలగజేసుకొని.. శంకర్‌నాయక్‌కు క్షమాపణలు చెప్పారు. సమన్వయం లోపం జరిగిందని.. సారీ సార్ అంటూ ఎమ్మెల్యేకు కలెక్టర్ సర్ది చెప్పారు. ఈ వ్యవహారం ప్రస్తుతం గులాబీ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.