తెలంగాణ హైకోర్టులో స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఇచ్చిన ప్రకటనపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఎస్బీఐ ప్రస్తుతం తమ కస్టమర్లకు సంబంధించి కేవైసీ చేసే పనిలో నిమగ్నమైంది. అందుకు సంబంధించిన మొత్తం ప్రాసెస్ పూర్తీ అవ్వాలంటే ఏదైనా ప్రూఫ్ ను సమర్పించాలంటూ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా జనవరి 26న ప్రకటన ఇచ్చింది. కేవైసీ ప్రాసెస్ అన్నది కస్టమర్లకు తప్పనిసరి అని.. బ్యాంకుకు వెళ్లి ఆధార్ లేదా ఓటర్ ఐడీ లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాస్ పోర్ట్ లేదా ఎన్.పి.ఆర్. ఇచ్చిన లెటర్ లేదా పాన్ కార్డు సహాయంతో కేవైసీ ని అప్డేట్ చేసుకోమని చెప్పింది.

ఈ ప్రకటనను సవాలు చేస్తూ న్యాయవాది ఖాజా ఐజాజుద్దీన్‌ తెలంగాణ హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. కేవైసీని గుర్తించేందుకు ఇవ్వాల్సిన పత్రాల జాబితాలో జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్‌) నుంచి ఇచ్చే లేఖను చేర్చుతూ ఎస్బీఐ ప్రకటన జారీచేసిందని.. లేనిపక్షంలో బ్యాంకు ఖాతాలను స్తంభింపచేస్తామని పేర్కొంది. ఎస్బీఐ ప్రకటన అమలుకాకుండా స్టే ఇవ్వాలని పిటిషనర్‌ కోరారు. దేశంలో ఇంకా ఎన్పీఆర్‌ ప్రక్రియ మొదలుకాకముందే లేఖను కోరడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. పిల్‌లో కేంద్ర క్యాబినెట్‌ సెక్రటరీ, కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి, ఆర్బీఐ, ఎస్బీఐ, జాతీయ జనాభా లెక్కల కమిషనర్‌ లను ప్రతివాదులుగా చేర్చారు. కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 1 నుండి సెప్టెంబర్ 30, 2020 మధ్యన జాతీయ జనాభా పట్టిక ను రూపొందించాలని భావిస్తోంది. దేశ వ్యాప్తంగా ఎన్పీఆర్ కు తీవ్ర వ్యతిరేకత వస్తున్న సంగతి తెలిసిందే.. ఇలాంటి తరుణంలో ఎస్బీఐ తమ ప్రకటనలో జాతీయ జనాభా పట్టిక నుంచి ఇచ్చే లేఖను కోరడం చర్చనీయాంశమైంది.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.