పార్టీ సమావేశానికి రాపాక డుమ్మా .. ఎంచక్కా కొడాలి నానితో కలిసి..
By సుభాష్
జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అధిష్టానానికి మరోసారి షాకిచ్చారు. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ శనివారం నాడు పార్టీ నేతలతో విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశానికి ఎమ్మెల్యే రాపాక హాజరుకాలేదు. మీటింగ్‌కు హాజరుకాని ఆయన.. గుడివాడలో మంత్రి కొడాలి నానితో కలిసి ఎడ్ల పందాలకు వెళ్లారు.
ఓ పక్క పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరుగుతుంటే.. రాపాక మాత్రం ఏంచక్కా నానితో కలిసి ఎడ్ల పందాలను తిలకించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నేను ఇప్పటివరకూ ఎడ్లపందాలు చూడలేదని.. అందుకే గుడివాడకు వచ్చానని అన్నారు. సీఎం వైఎస్ జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం సరైనదేనని రాపాక అన్నారు.
ఇక ఈ విషయంలో రాజధాని రైతులు ధర్నాలు చేయడం కంటే.. సీఎంను కలిస్తే మంచిదని సలహా ఇచ్చారు. తాను జనసేనలో ఉన్నా నా అభిప్రాయాన్ని స్వతంత్రంగా చెబుతానని రాపాక అన్నారు. ఇదిలా ఉంటే.. రాపాక ఇలా అధిష్టానానికి షాకులివ్వడం కొత్తేమీ కాదు. ఇప్పటికే సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలను స్వాగతించి.. ప్రశంసల వర్షం కురిపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇక రాపాక సమావేశానికి హాజరుకాకపోవడంపై పార్టీ నేతలు మాత్రం కావాలనే మీటింగ్‌కు గైర్హాజరయ్యారని అంటున్నారు.