ఎమ్మెల్యే ప్రేమ పెళ్లి.. కోర్టుకెక్కిన అమ్మాయి తండ్రి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  9 Oct 2020 7:17 AM GMT
ఎమ్మెల్యే ప్రేమ పెళ్లి.. కోర్టుకెక్కిన అమ్మాయి తండ్రి

తమిళనాడులో అధికార పార్టీ ఎమ్మెల్యే ఓ యువతిని కులాంతర వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే.. తన కుమార్తెను కిడ్నాప్ చేసి, భయపెట్టి ఎమ్మెల్యే పెళ్లిచేసుకున్నాడని ఆ యువతి తండ్రి కోర్టుకెక్కాడు. దీంతో ఆ యువతిని కోర్టులో ప్రవేశపెట్టాలని న్యాయమూర్తి ఆదేశించారు.

అసలేం జరిగిందంటే.. అధికార అన్నాడీఎంకే ఎమ్మెల్యే ప్రభు(36) కళ్లకురిచ్చి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అతను తియగదురగంలో బీఏ రెండో సంవత్సరం చదువుతున్న సౌందర్య(19) అనే యువతిని ప్రేమించాడు. సౌందర్య తండ్రి ఒక దేవాలయంలో అర్చకుడిగా పని చేస్తున్నాడు. సౌందర్య కూడా ఎమ్మెల్యేను ప్రేమించింది. అమ్మాయి తండ్రి ఈ ప్రేమను అంగీకరించలేదు. దీంతో ఎమ్మెల్యే ప్రభు తన సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో సౌందర్య మెడలో అక్టోబర్ 5న తాళి కట్టాడు. తియగదురగంలోని ఎమ్మెల్యే ఇంట్లో నిరాడంబరంగా ఈ వివాహం జరిగింది.

తన కుమార్తెను కిడ్నాప్ చేసి, బెదిరింపులకు పాల్పడి, బలవంతంగా ప్రభు వివాహం చేసుకున్నాడంటూ, సౌందర్య తండ్రి స్వామినాథన్ కోర్టులో కేసు దాఖలు చేశాడు. విచారణ చేపట్టిన న్యాయమూర్తి.. సౌందర్యను కోర్టులో హజరుపరచాలని ఆదేశించారు. తాజాగా.. కోర్టు ఆదేశంపై స్పందించిన ప్రభు, తన భార్యను నేడు కోర్టు ముందు హాజరు పరిచేందుకు సిద్ధంగా ఉన్నానని, తన మామయ్యతో మాట్లాడాలని ఎంతగా ప్రయత్నిస్తున్నా, ఆయన వినిపించుకోవడం లేదన్నారు.

తామిద్దరమూ మేజర్లమని, ప్రేమించుకున్నామని చెప్పిన ఆయన, అసవసరంగా స్వామినాథన్ ఈ విషయంలో రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు. కోర్టు ఆదేశాలను శిరసావహించేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. కాగా.. ఈ కేసులో సౌందర్య సైతం భర్త వెనుకే ఉండటం గమనార్హం. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, ఇష్టపూర్వకంగానే ప్రభును పెళ్లాడానని ఆమె తెలిపింది. తన కుమార్తెను కాపాడాలంటూ.. స్వామినాథన్ కోర్టులో పటిషన్ వేయడంతో ఆమెను తమ ముందు హాజరు పరచాలని న్యాయమూర్తి ఆదేశించారు.

Next Story
Share it