ఎమ్మెల్యే ఆర్‌కే సంచలనం.. రాజధానిని తరలిస్తామని చెప్పలేదు..!
By అంజి Published on 6 Jan 2020 4:14 PM ISTఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అమరావతి నుంచి రాజధానిని తరలిస్తామని ఏనాడు చెప్పలేదని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. కాగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో అమరావతిపై సీఎం జగన్ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కర్నూలులో జ్యుడిషియల్, విశాఖలో ఎగ్జిక్యూటివ్, అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్ అంటూ మూడు రాజధానుల ప్రకటన చేశారు. నాటి నుంచి రాజధానిని తరలించొద్దంటూ అమరావతి రైతులు, మహిళలు చేస్తున్న ఉద్యమం రోజు రోజుకు ఉధృతరూపం దాలుస్తుంది.
మరోపక్క, ఏపీ భౌగోళిక పరిస్థితుల విశ్లేషణపై ఏర్పాటైన జీఎన్ రావు కమిటీతో పాటు, తాజాగా బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ కమిటీ సైతం అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్ చేసిన మూడు రాజధానుల ప్రకటనతో ఏకీభవించాయి. అలాగే ఇదే అంశంపై గతంలో నివేదికలు ఇచ్చిన శ్రీకృష్ణ కమిటీ, శివరామకృష్ణ కమిటీ సైతం రెండు రాజధానుల అవసరం ఎంతైనా ఉందంటూ పేర్కొన్నాయని, నివేదికలోని అంశాలను మీడియా ముందుకు తెస్తున్నారు వైసీపీ నేతలు. ఈ నేపథ్యంలో అమరావతి నుంచి రాజధానిని తరలించడం లేదంటూ ఎమ్మెల్యే ఆర్‌కే చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.
ఎమ్మెల్యే ఆర్‌కే మీడియాతో మాట్లాడుతూ జీఎన్‌రావు కమిటీ, బోస్టన్ కమిటీ రెండు కూడుకుని హైపవర్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, ఆ కమిటీ నివేదికను అనుసరించి తమ భవిష్యత్తు ప్రణాళిక ఉంటుందన్నారు. ఈ క్రమంలో రాజధాని మార్పుపై ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన రాలేదన్నారు. ఒకవేళ రాజధాని తరలింపు ప్రకటన వచ్చినా కూడా, అమరావతి రైతులకు చెందాల్సిన 1,450 గజాల భూమిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి ఇస్తామని సీఎం జగన్ చెప్పిన విషయాన్ని ఎమ్మెల్యే ఆర్‌కే గుర్తు చేశారు.
బోస్టన్ కమిటీ, జీఎన్‌రావు కమిటీ నివేదికలను పక్కన పెడితే, శివరామకృష్ణన్ కమిటీ చాలా స్పష్టంగా చెప్పింది. అమరావతి ప్రాంతం రాజధాని నిర్మాణానికి అనుకూలం కాదని, నాటి చంద్రబాబు ప్రభుత్వం ఆ నివేదికను ప్రజల ముందుకు ఎందుకు పెట్టలేదంటూ ప్రశ్నించారు ఆర్‌కే. రాజధానికి అనుకూలం కాదని నివేదికలు చెప్పినా చంద్రబాబు చేశారు కనుక, భవిష్యత్‌లో రాజధానికి ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు తాము రాజధానిని మార్పు చేస్తున్నాని చెప్పారు.
టీడీపీ హయాంలో అమరావతి నిర్మాణం కోసం దాదాపు రూ.5,300 కోట్లకుపైగా నిధులను ఖర్చు చేశారు. ఆ మొత్తానికి సంబంధించి ఇప్పటికీ ప్రతి సంవత్సరం రూ.700 కోట్లు వడ్డీ రూపంలో కడుతున్నాం. ఇక ఆ లెక్కన లక్షా 25 కోట్లు పనులను చంద్రబాబు పెండింగ్‌లో వదిలిపెట్టి వెళ్లారు. అమరావతి నిర్మాణం జరగాలంటే ఆ లక్షా 25 కోట్ల నిధులు ఖర్చు చేయక తప్పదు. అంతటి మొత్తాన్ని తీసుకువచ్చి రాజధానికి అనుకూలం కాని అమరావతి ప్రాంతంలో ఎలా ఖర్చు చేస్తాం? అసలు అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురావాలి? అంటూ ఆర్కే ప్రశ్నించారు.