అమరావతి: దేవాదాయ భూములపై ఎల్లో మీడియా అసత్యపు కథనాలు ప్రచురిస్తోందని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మండిపడ్డారు. భీమిలిలో దేవాలయ భూములపై తప్పుడు కథనాలు రాశారని.. టీడీపీ పాలనలో జరిగిన అవినీతి కనిపించ లేదా అంటూ ఎల్లో మీడియాపై వెల్లంపల్లి ఫైర్‌ అయ్యారు. ప్రభుత్వంపై బురదచల్లే విధంగా వ్యవహరిస్తున్నారన్నారు. వార్త రాసే ముందు వాస్తవాలు పరిశీలించాలని, ఎల్లో మీడియాకు ప్రభుత్వ పథకాలు కనిపించడం లేదు అంటూ కామెంట్‌ చేశారు.

ఇంటి వద్దకే పెన్షన్‌ వచ్చేలా చేసి వృద్ధులకు సీఎం వైఎస్‌ జగన్‌ భరోసా ఇచ్చారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. దేవాదాయ భూములను పవిత్రమైన భూములుగా భావిస్తామని, వాటి పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. దేవాదాయశాఖలో గజం స్థలం అమ్మాలన్న హైకోర్టు పర్మిషన్‌ కావాలని.. ఈ చిన్న విషయం కూడా చంద్రబాబు అండ్‌ పార్టీకి తెలియదా అంటూ వెల్లంపల్లి ప్రశ్నించారు. దేవాదాయ భూములకు ఇబ్బందులు లేకుండా ముందుకెళ్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో మఠం భూములను ఇష్టారాజ్యంగా లీజులకు ఇచ్చేవారని, టీడీపీ ప్రభుత్వం చేసినట్లుగా దేవాదాయ భూములను ధారదత్తం చేయడం లేదన్నారు. హధీరాంజీ మఠం భూముల దుర్వినియోగంపై చర్యలు తీసుకున్నామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు.

గతంలో టీడీపీ నేతలు భారీగా అవినీతికి పాల్పడ్డారని బ్రహ్మణకార్పొరేషన్‌ చైర్మన్‌ మల్లాది విష్ణు అన్నారు. అర్చర సంక్షేమ నిధులపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందన్నారు. మూడు రోజుల కిందట రూ.234 కోట్ల అర్చక సంక్షేమ నిధిని దారి మళ్లీంచారని మాజీ చైర్మన్‌ నిరాధార ఆరోపణలు చేశారన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలనుసారం అర్చకసంక్షేమ నిధిని ఏర్పాటు చేశామని తెలిపారు. రూ.171 కోట్ల ఎఫిడిఆర్‌లు ఉన్నాయన్నారు. దాని గైడ్‌ లైన్స్‌ ప్రకారం ఖర్చు చేస్తామని మల్లాది విష్ణు తెలిపారు. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను తొలగించి వాటిని ఖర్చు చేసే అధికారం ఎవరికి ఉండదని.. అది సుప్రీంకోర్టు తీర్పును వయోలెట్‌ చేస్తుందన్నారు.

2019-20 సంవత్సరానికి అర్చక వెల్ఫేర్‌ బోర్డు నుంచి దాదాపు రూ.10 కోట్లను ఉపనయనం చేసుకున్న 81 మందికి 20 లక్షలు, అలాగే వివాహం చేసుకున్న 73 మందికి 73 లక్షలు, విద్యకు సంబంధించి 132 మందికి 71 లక్షలు, పదవి విరమణ చేసిన వారికి 7 లక్షల 15 వేలు, వేదపాఠశాలకు సంబంధించిన వారికి 80 వేలు.. ఇలా ఎనిమిది అంశాలను అధికారుల సమక్షంలో ఏడు నెలల కాలంలో ఖర్చు పెట్టడం జరిగిందని మల్లాది విష్ణు తెలిపారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.