#AskKTR.. ఏపీ రాజధానుల అంశంపై మంత్రి కేటీఆర్ స్పందన
By అంజి Published on 29 Dec 2019 5:25 PM ISTహైదరాబాద్: #AskKTR పేరుతో సోషల్ మీడియా వేదిక ట్విట్టర్‌లో మంత్రి కేటీఆర్ చర్చాగోష్టి కార్యక్రమం నిర్వహించారు. పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. మంత్రి పదవి కంటే వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టుకే ఓటు వేస్తానని కేటీఆర్ అన్నారు. కొత్త మున్సిపాలిటీ చట్టంతో అవినీతికి చెక్ పెట్టామని ట్విట్టర్‌లో తెలిపారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో డంప్‌యార్డులు ఏర్పాటు చేస్తామన్నారు. కొత్త ఏడాదిలో టి హబ్ రెండో ఫేజ్‌ను ప్రారంభిస్తామన్నారు. దేశంలోనే అత్యంత ప్రశాంతమైన రాష్ట్రం తెలంగాణ అని అన్నారు.
ఎయిర్‌పోర్టు వరకు మెట్రో సేవల పొడిగింపుపై కసరత్తు చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్‌లో రోడ్లు త్వరలోనే మెరుగుపడతాయని ట్వీట్ చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్షం లేదని, ప్రభుత్వం రాష్ట్ర సమస్యలను ఎలా తెలుసుకుంటుందని ఓ నెటిజన్ కేటీఆర్‌కు ప్రశ్న వేశారు. తమకు 60 లక్షల మంది కార్యకర్తల నుంచి ఫీడ్ బ్యాక్ వస్తుందని కేటీఆర్ రీట్వీట్ చేశారు. త్వరలో రైతు భీమా డబ్బులు రైతుల అకౌంట్‌లో వేస్తామన్నారు. ఈ సందర్భంగా ఏపీ మూడు రాజధానుల అంశంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఒక భారతీయుడిగా ఏపీ రాజధానిపై అభిప్రాయాన్ని చెప్పాలని ఓ నెటిజన్ కేటీఆర్‌ను కోరారు. ఏపీ సీఎం ఆరు నెలల పాలన బాగుందన్నారు. అయితే ఏపీ రాజధానిపై అక్కడి ప్రజలు తీర్పు చెప్పాలని, తాను కాదని కేటీఆర్ అన్నారు.