కవితకు మంత్రి పదవి దక్కేందుకు త్యాగం చేసే మంత్రి ఎవరు..?
By సుభాష్ Published on 18 March 2020 2:12 PM GMTనిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ బరిలో ఉన్నారు. ఇందుకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, ఆమె నామినేషన్ వేయడం కూడా జరిగిపోయాయి. కవిత గెలవగానే కేసీఆర్ కేబినెట్‌లో తీసుకుంటారా..? లేదా..? అన్నది ఆసక్తికరంగా మారింది. మరో కీలకమైన విషయమేమిటంటే తెలంగాణ మంత్రివర్గంలో ప్రస్తుతానికి ఖాళీ లేవు.కేసీఆర్‌తో కలుపుకొని మొత్తం 18 మందితో తెలంగాణ కేబినెట్ కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో కవితను మంత్రిని చేయాలంటే ఎవరో ఒకరు తమ కేబినెట్ నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. దీంతో కవిత కోసం మంత్రి పదవి వదులుకోవడానికి సిద్ధమయ్యే నాయకుడు కావాలలి. అది ఎవరనేది చర్చ కొనసాగుతోంది.
ప్రస్తుతం కేసీఆర్ మంత్రివర్గంలో ఇద్దరు మహిళా మంత్రులున్నారు. అందులో ఒకరు రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారు కాగా, మరొకరు గిరిజన సామాజికవర్గానికి చెందిన వారున్నారు. దీంతో వీరిలో ఏ ఒక్కరిని కేసీఆర్ పక్కనపెట్టే అవకాశాలు లేవు. కవిత కోసం బీసీ మంత్రులను పక్కనపెట్టే సాహసం కేసీఆర్ చేయకపోవచ్చనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా నుంచి మంత్రిగా ప్రశాంత్‌రెడ్డి కవిత కోసం మంత్రిపదవిని త్యాగం చేస్తారా..? అనే చర్చ రాజకీయ వర్గాల్లో కొనసాగుతోంది. ఇక ప్రశాంత్ రెడ్డి కేసీఆర్‌కు సన్నిహితుల్లో ఒకరుగా మంచి పేరు ఉంది. అందుకే రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచినా ప్రశాంత్‌రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు.
ఒక వేళ కవితకు మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తే కేసీఆర్ ప్రశాంత్‌రెడ్డిని పక్కనపెడతారా..? అన్న చర్చ కూడా కొనసాగుతోంది. మొత్తానికి కవిత కేబినెట్‌లోకి రావాలంటే ఎవరో ఒకరు తమ పదవి నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక తాను తప్పుకొని తన కుమారుడైన కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయాలనే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఆ సమయంలో కేసీఆర్ కుమార్తె కవితకు మంత్రి వర్గంలో చోటు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.