అమరావతి: ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బహిరంగ లేఖ రాశారు. లేఖలో.. ఇవాళ ఈనాడు దినపత్రికలో తాను అన్నట్టుగా ప్రచురించిన వార్తను చూసిన తర్వాతే లేఖ రాస్తున్నానని మంత్రి బొత్స పేర్కొన్నారు. లేఖతో పాటు తాను మాట్లాడిన వీడియో లింక్‌ను కూడా పంపుతున్నానని, తప్పుడు వార్తను వెనక్కు తీసుకుంటూ బహిరంగ లేఖకు ప్రాముఖ్యం ఇచ్చి ప్రచురించాలని మంత్రి బొత్స లేఖలో కోరారు.

చంద్రబాబు, లోకేష్‌ సన్నిహితుల మీద ఐటీ దాడుల్లో ఏకంగా వేల కోట్లు వెలుగు చూసిందంటున్న నేపథ్యంలో చంద్రబాబును పూర్తిస్థాయిలో విచారించాలన్న డిమాండ్‌తోనే తాను విశాఖ పత్రికా సమావేశంలో మాట్లాడనని బొత్స తన లేఖలో చెప్పుకొచ్చారు. ప్రధానమైన విషయం.. ప్రధాన వార్త కాలేదని, ఇలాంటి మాటలు రుచించవు అంటూ పేర్కొన్నారు. చంద్రబాబు ఎన్ని లక్షల కోట్లు మింగేసినా మీకు(రామోజీరావు) ఆయన అంటే ఉన్న దిక్కుమాలిన ప్రేమ, గత మూడు దశాబ్దాలుగా మీ పత్రికల్లో కనిపిస్తూనే ఉందన్నారు. అయితే అదీ మీ ఇష్టం.. తెలుగు ప్రజల దౌర్భాగ్యం అంటూ లేఖలో మంత్రి బొత్స రాసుకొచ్చారు.

అలాగే డాక్టర్‌ వైఎస్సార్‌, వైఎస్‌ జగన్‌పై మీ వ్యతిరేకత, శుత్రుత్వం ఏనాడు మీరూ దాచుకున్నదలి లేదని, అలాగని తాము అనని మాటల్ని కూడా మీ అజెండా ప్రకారం ప్రచురించే స్థాయికి దిగజారి, చంద్రబాబు పార్టీని బతికించుకోవాలనుకుంటున్న మీ మానసిక స్థితిని ప్రశ్నించేందుకే ఉత్తరం రాస్తున్నానని మంత్రి బొత్స లేఖలో తెలిపారు.

రెండోది.. ఈ వ్యాఖ్యలు తాము చేయలేదని ఖండిస్తే, కేంద్ర రాష్ట్ర సంబంధాలను దెబ్బ కొట్టవచ్చన్నది మీ రెండో దూరాలోచన, నా వ్యాఖ్యలను వక్రీకరించి మీ మొదటి పెజీలో ప్రచురించిన తీరును చూస్తే ఈ విషయం అర్థమవుతోందని అంటూ మంత్రి బొత్స లేఖలో వివరించారు.

రాష్ట్ర ప్రయోజనాలు, ప్రధానంగా ఇక్కడి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ప్రయోజనాలు పరమావధిగా పని చేస్తున్న ప్రభుత్వం తమదని మంత్రి బొత్స పేర్కొన్నారు. కేంద్రానికి- రాష్ట్రానికి మధ్య సత్సంబంధాలు ఉండాలని, కేంద్రం నుంచి అవసరం మేరకు నిధులు తెచ్చుకునేలా సంబంధాలు ఉండాలని ఏ ప్రభుత్వమైనా కోరుకుంటుంది. అందులో భాగంగానే ప్రధానిని, హోం మంత్రిని, కేంద్రంలోని పెద్దలను ముఖ్యమంత్రి కలుస్తారన్నది కనీస జ్ఞానం ఉన్నవారికి అర్థం అవుతుందని మంత్రి బొత్స తన లేఖలో తెలిపారు.

చివరిగా మీ వార్త తప్పని, మీ ఆలోచన తప్పని, మీ పాలసీ తప్పని, అసత్యాలను ప్రచురించడం నేరం కూడా అని మంత్రి బొత్స లేఖలో పేర్కొన్నారు. మీ స్పందనను బట్టి తదుపరి కార్యాచరణ ప్రటికస్తానని మంత్రి బొత్స లేఖలో తెలిపారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.