పశ్చిమగోదావరి: 2021 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తామని సీఎం వైఎస్‌ జగన్‌ మొదటి నుంచి చెప్తున్నారని ఇరిగేషన్‌ శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ అన్నారు. పోలవరం పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఇవాళ అనిల్‌ కుమార్‌ పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్ట్‌ నిర్మాణం వీలైనంత త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. చెప్పిన సమయానికి జగన్‌ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తారని.. వైఎస్సాఆర్‌ ఆశయాలను నెరవేరుస్తారని మంత్రి అనిల్‌ పేర్కొన్నారు.

గత ప్రభుత్వం ఆర్‌ అండ్‌ ఆర్‌ అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యిందన్నారు. పోలవరం నిర్వాసితులకు 15 నుంచి 18 వేల ఇళ్లు నిర్మించే విషయంపై చర్చించామని మంత్రి అనిల్‌ వివరించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన బృందం పోలవరంపై సంతృప్తి వ్యక్తం చేసిందని, అనుకున్న ప్రకారమే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోందని ఆ బృందం ప్రతినిధులు రిపోర్టు ఇచ్చారని తెలిపారు. ప్రణాళిక బద్దంగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశాలు ఇచ్చారని పేర్కొన్నారు. నవంబర్‌ 1న పోలవరం పనులు ప్రారంభించామన్నారు. నాబార్డ్‌ నుంచి రూ.5 వేల కోట్ల నిధులు రావాలని.. కానీ రూ.18 వందల కోట్ల నిధులే విడుదలల చేశారని తెలిపారు.

కేంద్రం నుంచి పోలవరానికి సకాలంలో నిధులు రాకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందని మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ అన్నారు. ఆర్‌ అండ్‌ ఆర్‌ సమస్యల పరిష్కారం కోసం ఐఏఎస్‌ నేతృత్వంలో కమిటీ వేశామన్నారు. పోలవరంలో స్పిల్‌ వే పనులు మాత్రమే గత ప్రభుత్వం చేసిందన్నారు. రూ.55 వేల కోట్ల ప్రాజెక్ట్‌లో రూ.17 వేల కోట్ల ఖర్చు చేస్తే టీడీపీ నేతలు 75 శాతం ప్రాజెక్టు పూర్తైయ్యిందని ఎలా చెప్తారని మంత్రి అనిల్‌ ప్రశ్నించారు. కుడి కాలువ వైఎస్సార్‌ హయాంలోనే పూర్తైందని అనిల్‌ చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వంలో పని తక్కువ.. ప్రచారం ఎక్కువ అని, సీఎం జగన్‌ది పని ఎక్కువ.. ప్రచారం తక్కువ అని మంత్రి అనిల్‌ యాదవ్‌ అన్నారు.

అంజి

Next Story