ఖిల్వత్‌ గ్రౌండ్‌లో సీఏఏ నిరసన సభ ప్రారంభం..

By అంజి  Published on  25 Jan 2020 3:48 PM GMT
ఖిల్వత్‌ గ్రౌండ్‌లో సీఏఏ నిరసన సభ ప్రారంభం..

హైదరాబాద్‌: చౌమహల్లా ప్యాలెస్‌ పక్కన ఉన్న ఖిల్వత్‌ గ్రౌండ్‌లో పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరసత్వ పట్టిక, జాతీయ పౌరపట్టికలకు వ్యతిరేకంగా ఎంఐఎం భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ, ఇతర మజ్లీస్‌, ముస్లిం జేఏసీ నేతలు పాల్గొన్నారు. ఫెస్టివల్‌ ఆఫ్‌ డెమోక్రసీ పేరిటి జరుగుతున్న ఈ సభలో ముషాయిరా నిర్వహిస్తున్నారు. అయితే ఈ సభకు హైకోర్టు షరుతులతో కూడిన అనుమతులను ఇచ్చింది. ఆరుగురు వక్తలు మాత్రమే మాట్లాడాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. కాగా సభకు జాతీయ జెండాలతో పెద్ద సంఖ్యలో ముస్లిం మహిళలు, ప్రజలు హాజరయ్యారు. అర్థరాత్రి 12 గంటల అనంతరం జాతీయ పతాకావిష్కరణ తర్వాత ఈ కార్యక్రమం ముగియనుంది.

ఈనేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రామగుండం పోలీస్‌ కమిషనర్‌ వి.సత్యనారాయణ పర్యవేక్షణలో అదనపు బలగాలతో భద్రతను ఏర్పాటు చేశారు. సీసీఎస్‌కు చెందిన ఏసీపీలు, ఇన్స్‌స్పెక్టర్లకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఎక్కడా అల్లర్లు జరగకుండా చూడాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కేసులు నమోదు చేయాలని పోలీసులకు కోర్టు ఆదేశించింది.

Next Story