ఆర్సీబీ కేవలం బ్యాటింగ్ మీద మాత్రమే ఆధారపడలేదు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  27 Aug 2020 1:05 PM GMT
ఆర్సీబీ కేవలం బ్యాటింగ్ మీద మాత్రమే ఆధారపడలేదు

ఐపీఎల్ లో మంచి ఫ్యాన్ బేస్ ఉన్న క్రికెట్ టీమ్ లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు కూడా ఒకటి. మొదటి ఐపీఎల్ టైటిల్ ను ముద్దాడడానికి ఆర్సీబీ ఎంతగానో ఎదురుచూస్తోంది. ఆర్సీబీ బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉన్నప్పటికీ.. బౌలింగ్ లో రాణించకపోవడమే ఆ జట్టుకు మైనస్ పాయింట్ అని చెబుతూ ఉంటారు. స్లాగ్ ఓవర్లలో ధారాళంగా పరుగులు ఇచ్చేస్తూ ఉండడంతో ఆర్సీబీని ఓటమి చాలా సార్లు పలకరించింది. ఈసారి ఆ తప్పులు దొర్లకుండా టైటిల్ వేటను మొదలుపెట్టాలని ఆర్సీబీ భావిస్తోంది. అన్ని విభాగాలలోనూ పటిష్టంగా ఉండాలని కోరుతోంది.

ఆర్సీబీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ మైక్ హెస్సన్, ఆ జట్టు కోచ్ సైమన్ కటిచ్ లు ఈసారి ఎలాగైనా ఆర్సీబీ టైటిల్ అందుకునేలా ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే దుబాయ్ కు చేరుకున్న ఆర్సీబీ జట్టు ఆరు నెలల గ్యాప్ తర్వాత ఆటగాళ్లు మైదానంలో అడుగుపెట్టడంపై పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడిన 2016 సీజన్ లో ఫైనల్ లో అడుగుపెట్టిన ఆర్సీబీ ఆ తర్వాత మూడేళ్లు గొప్ప ప్రదర్శన ఇవ్వలేకపోయింది. ఆర్సీబీ సీనియర్ ప్లేయర్ యజువేంద్ర చాహల్ ఇటీవల మాట్లాడుతూ డెత్ బౌలింగ్ లో లోపం కారణంగానే తమ జట్టు 30శాతం మ్యాచ్ లు ఓడిపోయిందని తెలిపాడు.

దీనిపై మైక్ హెస్సన్ స్పందించాడు. ఆర్సీబీ డెత్ బౌలింగ్ తప్పకుండా మెరుగుపడాలని భావించామని.. ఆ విషయంలోనే ఆక్షన్ కు వెళ్లామని చెప్పాడు. ఇసురు ఉదాన, క్రిస్ మోరిస్, కేన్ రిచర్డ్సన్, స్టెయిన్ లాంటి వాళ్లను తీసుకోడానికి ముఖ్య కారణం అదేనని తెలిపారు. నవదీప్ సైనీ కూడా బౌలింగ్ విభాగంలో రాణిస్తున్నాడని స్పిన్నర్లు కూడా తమ వంతు పాత్ర పోషిస్తున్నారని అన్నాడు. చాహల్ లాంటి గొప్ప స్పిన్నర్ ఆర్సీబీకి బలం అని చెప్పుకొచ్చాడు. కేవలం బ్యాటింగ్ మీద మాత్రమే ఆధారపడలేదని స్పష్టం చేశాడు.

ఫించ్ కెప్టెన్ గా, ఆటగాడిగా ఆస్ట్రేలియా తరపున రాణించాడని.. అతడి నాయకత్వ లక్షణాలు జట్టుకు మంచి చేస్తాయని చెప్పారు. డేల్ స్టెయిన్, ఏబీ డివిలియర్స్ అద్భుతమైన ఆటగాళ్ళని.. వారు కొన్ని రోజుల పాటూ క్రికెట్ కు దూరంగా ఉన్నప్పటికీ వారు అద్భుతమైన ఆటగాళ్ళని తెలిపాడు. సౌత్ ఆఫ్రికాలో నిర్వహించిన ఛారిటీ మ్యాచ్ లో ఏబీడీ అద్భుతంగా ఆడాడని చెప్పుకొచ్చాడు.

స్టెయిన్ కూడా అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడని.. టీ20ల్లో రాణించడానికి సిద్ధంగా ఉన్నాడని, వివిధ రకాల బంతులను వేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడని తెలిపాడు. స్టెయిన్ రిటైర్డ్ అవ్వడానికి సిద్ధంగా లేడని.. తన వంతుగా జట్టుకు తోడ్పడాలని ప్రయత్నిస్తున్నాడని మైక్ హెస్సన్ జట్టు గురించి వివరించాడు.

చాలా పెద్ద విరామం తర్వాత ఆటగాళ్లను టోర్నమెంట్ కోసం సిద్ధం చేయడం చాలా కఠినమైన విషయమని సైమన్ కటిచ్ చెప్పుకొచ్చాడు. విరామం తర్వాత ఆటగాళ్లను మ్యాచ్ కు సిద్ధం చేయడం అంటే ఒక్క ఫిజికల్ గానే కాదని.. మెంటల్ గా కూడా వారిని సిద్ధం చేయాల్సి ఉందని కటిచ్ అన్నాడు.

Next Story