బస్సు, ట్రక్కు ఢీకొని వలస కూలీలు మృతి

By Newsmeter.Network  Published on  14 May 2020 10:03 AM IST
బస్సు, ట్రక్కు ఢీకొని వలస కూలీలు మృతి

మధ్య ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వలస కూలీలతో వెళ్తున్న ట్రక్కు అదుపు తప్పి బస్సును ఢీకొట్టింది. దీంతో ట్రక్కులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది మృతిచెందారు. మధ్యప్రదేశ్‌లోని గునా జిల్లా కాంట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అర్థరాత్రి ఈ ప్రమాదం జరిగింది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. బుధవారం మహారాష్ట్ర నుంచి సుమారు 60 మంది వలస కూలీలు ట్రక్కులో తమ స్వస్థలమైన ఉత్తర్‌ప్రదేశ్‌కు బయలు దేరారు. మధ్యప్రదేశ్‌లోని గుణ ప్రాంతంలోకి రాగానే రోడ్డు ప్రమాదం జరిగింది.

Also Read :హైదరాబాద్‌: ప్రత్యేక రైళ్లకు వెయిటింగ్‌ లిస్ట్‌.. ఎప్పటి నుంచి అంటే..

కూలీలు ప్రయాణిస్తున్న ట్రక్కు అదుపుతప్పి బస్సును ఢీకొనడంతో 8మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయాలతో ఘటన స్థలంలో పడిపోయారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలికి చేరుకొని క్షతగాత్రులను అంబులెన్సుల సహాయంతో సమీపంలోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో 50మంది ఉండగా. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదం పట్ల ఆయా రాష్ట్రాల సీఎంలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్‌ సీఎం ఘటనపై స్పందిస్తూ.. చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించేలా చూడాలని స్థానిక అధికారులను ఆదేశించారు.

Next Story