విద్యార్థుల ఇంటికే 'మధ్యాహ్న భోజన' బియ్యం
By సుభాష్ Published on 22 Jun 2020 11:08 AM ISTదేశ వ్యాప్తంగా విజృంభిస్తున్నకరోనా ప్రభావం అంతా ఇంతా కాదు. దీని ప్రభావం అన్నిరంగాలతో పాటు విద్యాసంస్థలపై కూడా పడింది. అయితే కరోనా కాలరాస్తున్న నేపథ్యంలో కొత్త విద్యాసంవత్సరం ఎప్పుడు ప్రారంభం అవుతుందో తెలియని పరిస్థితి. ఇక ప్రభుత్వ పాఠశాలలు మొదలైతే పేద విద్యార్థుల ఆకలి కూడా తీరేది. కరోనా వల్ల విద్యా సంస్థలు మూతపడటంతో మధ్యాహ్నభోజనం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం భోజనానికి సంబంధించి బియ్యాన్ని విద్యార్థుల ఇళ్లకే పంపిణీ చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఈ మేరకు కేంద్రం అన్ని రాష్ట్రాలకు లేఖ రాసింది.ఇక తెలంగాణలో మధ్యాహ్న సమయంలో సన్నబియ్యం పెడుతున్నందున ఆ బియ్యాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 24 లక్షల మంది విద్యార్థులకు పంపిణీ చేయడంపై రాష్ట్ర ప్రభుత్వానికి విద్యాశాఖఅధికారులు ప్రతిపాదనలు పంపారు.
ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే..
కాగా, మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులకు అందించే సన్నబియ్యం వారి ఇళ్లకే పంపిణీ చేయడంపై మార్గదర్శకాలను రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే సన్నబియ్యం పంపిణీపై మార్గదర్శకాలను రూపొందించి డీఈవోలకు ఆదేశాలు జారీ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ విధానం జూన్ లేదా జులై నుంచి అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రతి విద్యార్థికి నెలకు మూడు కిలోల చొప్పున..
ప్రతి విద్యార్థికి నెలకు మూడు కిలోల చొప్పున అందించనున్నారు. ప్రతి విద్యార్థికి 150 గ్రాముల చొప్పున నెలలో తరగతులు జరిగే రోజులతో లెక్కిస్తారు. లేదంటే నెలకు నాలుగు కిలోల బియ్యాన్ని పంపిణీ చేసే అవకాశం ఉంది. అంతేకాదు పప్పులు, నూనె, ఇతర సామాగ్రి, కూరగాయల ఖర్చులను కూడా అందించాలని భావిస్తోంది
కాగా, ప్రతి నెలా ఒక్కో విద్యార్థికి రూ.120 నుంచి రూ.130 వరకు వంట ఖర్చులను విద్యార్థులు లేదా తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాలకు జమ చేసే ఉద్దేశంతో ఉన్నట్లు తెలిసింది. ఖర్చులో కేంద్రం వాటా 60శాతం, రాష్ట్ర వాటా 40 శాతం ఉండనుంది. మరో రెండు, మూడు నెలల వరకు పాఠశాలలు ప్రారంభమయ్యే అవకాశాలు లేవని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్ధన్‌రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం బియ్యాన్ని విద్యార్థుల ఇళ్లకే పంపించడం మేలని ఆయన అన్నారు.