మృత్యువు వెంటాడుతున్నా.. రోమాలు నిక్కబొడిచేలా సంతోష్ వీరోచిత పోరు

By సుభాష్  Published on  22 Jun 2020 4:26 AM GMT
మృత్యువు వెంటాడుతున్నా.. రోమాలు నిక్కబొడిచేలా సంతోష్ వీరోచిత పోరు

ముఖ్యాంశాలు

  • సంతోష్ పోరు ఎంతన్నది తాజాగా బయటకొచ్చింది

  • సంతోష్ ప్రాణాలు విడిచే వేళలో అసలేమైంది?

గల్వాన్ ఘటన.. యావత్ దేశాన్ని విషాదంలో ముంచేయటమే కాదు.. డ్రాగన్ దురాగతంపై ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యేలా చేసింది. కల్నల్ సంతోష్ బాబుతో పాటు మరో ఇరవై మంది సైనికుల మరణానికి ముందు అసలేం జరిగింది? అన్న విషయంపై పెద్దగా స్పష్టత లేదు. తాజాగా బయటకొచ్చిన సమాచారం మన సైనికుల వీరోచిత పోరాటం కళ్లకు కట్టేలా ఉండటమే కాదు.. వారు ప్రదర్శించిన ధైర్యసాహసాలు ప్రజల రోమాలునిక్కబొడిచేలా ఉన్నాయని చెప్పక తప్పదు. తమ బలం తక్కువగా ఉన్నా.. మంది ఎక్కువ ఉన్న చైనీయుల దుర్మార్గాన్ని ప్రశ్నించటమే కాదు.. వారి దాడిని ఎదురొద్ది పోరాడిన వైనం తెలుసుకొని తీరాల్సిందే. రీల్ లో చూసే పోరుకు మించిన రీతిలో మనోళ్లు ప్రదర్శించిన ధైర్య సాహసనాలు నిరుపమానం.

ఈ నెల పద్నాలుగున గల్వాన్ లోయలో అసలేం జరిగింది? ఘర్షన ఎందుకు చోటు చేసుకుంది? చైనీయుల దాడికి మనోళ్ల ప్రతిదాడి ఎలా సాగింది? అన్న విషయాల్లోకి వెళితే..

గల్వాన్ ప్రాంతంలో 16 బిహార్ రెజిమెంట్ విధులు నిర్వర్తిస్తోంది. ఈ దళానికి కల్నల్ సంతోష్ బాబు కమాండింగ్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. నెల రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనటంతో రెండు దేశాలకు చెందిన బలగాలు పోటాపోటీగా సరిహద్దుల్లోకి తరలించాయి. ఈ తీవ్రతను తగ్గించేందుకు ఈ నెల ఆరున రెండు దేశాలకు చెందిన లెఫ్టినెంట్ జనరల్ స్థాయి సైనికాధికారుల మధ్య చర్చలు జరిగాయి. ఇందులో కుదిరిన ఒప్పందం ప్రకారం రెండు దేశాలు తమ సరిహద్దుల నుంచి అదనపు బలగాల్ని వెనక్కి తరలించాయి. అందుకే ఓకే చెప్పారు.

సైనిక బలగాల ఉపసంహరణను పర్యవేక్షించే బాధ్యతను భారత సైనిక నాయకత్వం కల్నల్ సంతోష్ కు అప్పజెప్పారు. ముందుగా అనుకున్నట్లు చైనా సైనికులు తమ ప్రాంతాల్ని ఖాళీ చేశారు. తమ శిబిరాల్ని తీసేశారు. అనూహ్యంగా ఈ నెల 14న చైనా సైన్యం అక్కడో కేంద్రాన్ని.. కొన్ని గుడారాల్ని ఏర్పాటు చేసింది. ముందుగా జరిగిన ఒప్పందం ప్రకారం దాన్నితొలగించాలన్న సందేశంతో చెప్పి కొందరిని డ్రాగన్ దళాల వద్దకు పంపారు. అందుకు వారు ససేమిరా అన్నారు. ఇదే విషయాన్ని సంతోష్ కు తెలియజేశారు. గస్తీ దళం వచ్చి వెళ్లిన తర్వాత చైనీయులు మరింత మందిని తెప్పించారు. అక్కడి పరిస్థితిని తెలుసుకున్న సంతోష్ స్వయంగా తానే రంగంలోకి దిగారు.

వివాదం జరుగుతున్న ప్రాంతానికి వెళ్లగా.. ఎప్పుడూ అక్కడ ఉండే వారు లేకపోగా.. కొత్తవారు ఉన్నట్లు గుర్తించారు. కొద్ది రోజుల ముందు జరిగిన ఒప్పందం ్పరకారం గుడారాల్ని ఏర్పాటు చేయటం అక్రమమన్న విషయాన్ని చైనా కమాండర్ కు సంతోష్ స్పష్టం చేశారు. ఈ సందర్భంలో చైనా సైనికుడు ఒకరు ఆయన్ను బలంగా తోసేశారు. తమ సీవో సాబ్ పై జులుం చేయటంపై భారత సైనికుల్లో ఆగ్రహం పెల్లుబుకింది. చైనా సైనికులపై పిడిగుద్దులు విసిరారు. ఈ పోరు అరగంట పాటు సాగింది. ఇరు వర్గాల్లోని చాలామంది గాయపడ్డారు.

మొత్తంగా భారత బలగాలదే పైచేయి అయ్యింది. భారత సైనికులు చైనా గుడారాల్నినేల కూల్చటమే కాదు.. వాటిని కాల్చి బూడిద చేశారు. దీంతో.. చైనా బలగాలు వెనక్కి మళ్లాయి. ఇంత జరిగిన తర్వాత వెనక్కి వెళ్లేందుకు సంతోష్ ససేమిరా అన్నారు. అక్కడే ఉండిపోయారు. గాయపడిన వారిని వెనక్కి పంపి అదనపు బలగాల్ని తెప్పించారు. ఘర్షణ కారణంతో అక్కడ తీవ్రస్థాయిలో టెన్షన్ నెలకొంది. కాసేపటికి చైనాకు చెందిన బలగాలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నాయి.

వారి చేతుల్లో ఇనుప కడ్డీలు ఉన్నాయి. వాటితో భారత సైనికులపై దాడి చేశారు. వారి దాడిని భారత సైనికులు బాయినెట్లతో ఎదుర్కొన్నారు. ఆ సమయంలో భారత బలగాలు వంద వరకు ఉంటే.. చైనా సైనికులు 350 మందికి పైనే ఉన్నారు. ఇలాంటివేళలో సంతోష్ నాయకత్వంలోని భారత బలగాలు భీకర పోరాటానికి సిద్ధమయ్యాయి. అప్పటికే చీకటి పడిన వేళ.. మరికొందరు చైనా సైనికులు అక్కడికి వచ్చారు. వస్తూనే.. భారత సైనికుల మీద పెద్ద రాళ్లతో దాడి చేశారు. ఇలాంటివేళలోనే సంతోష్ తల మీద పెద్ద రాయి పడింది. దీంతో ఆయన గల్వాన్ నదిలోకి ఒరిగిపోయారు.

తమ కమాండింగ్ అధికారి నేలకు ఒరగటంతో భారత సైనికులు ఆగ్రహంతో ఊగిపోయారు. 350 మంది ఉన్న చైనా సైనికుల్ని లెక్క చేయకుండా ఉన్న వంద మంది కలిసి వారిపై విరుచుకుపడ్డారు. ఈ పోరులో ఇరు దేశాలకు చెందిన సైనికులు పలువురు మరణించారు. దాదాపు మూడు గంటల పాటు సాగిన పోరులో సంతోష్ తో సహా పలువురి భౌతికకాయాల్ని అక్కడి నుంచి తరలించారు. తర్వాతి రోజున కూడా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చైనా సైనికుల డెడ్ బాడీలను ఆ దేశానికి అప్పజెప్పారు. చైనా సైనికులతో పోలిస్తే.. భారత బలగాలుతక్కువగా ఉన్నా.. వారిని ఎదుర్కొనేందుకు మనోళ్లు ప్రదర్శించిన ధైర్యసాహసాలు చరిత్రలో నిలిచిపోయేలా మారాయి.

Next Story