'అమ్మా.. డాడీని మరిచిపో.. డాడీ నాకొద్దు.. నెంబర్‌ డిలీట్‌ చేయ్..'

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 July 2020 7:23 AM GMT
అమ్మా.. డాడీని మరిచిపో.. డాడీ నాకొద్దు.. నెంబర్‌ డిలీట్‌ చేయ్..

అమ్మా డాడీని మరిచిపోమ్మా.. ఈ డాడీ నాకొద్దూ.. డాడీ నెంబర్ డిలీట్‌ చేయి.. అంటూ ఓ చిన్నారి తన తల్లిని ఓదార్చే ప్రయత్నం చేసింది. నడిరోడ్డుపై కూర్చుని న్యాయం కోసం ఏడుస్తున్న తల్లితో చిన్నారి చెప్పిన మాటలు ఇవి. ఈఘటన తిరుపతి నగరం నడి బొడ్డున జరిగింది.

వివరాల్లోకి వెళితే.. తిరుపతిలోని స్థానిక పెద్దకాపు వీధిలో నివాసముంటున్న వెంకటాచలం, సరస్వతిలు పదమూడు ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్ల పాటు వీరి కాపురం సజావుగా సాగింది. వీరికి ఆరేళ్ల కుమారై ఉంది. కాగా.. వెంకటాచలం గుట్టు చప్పుడు కాకుండా మరో మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి దంపతుల మధ్య గొడవులు జరుగుతున్నాయి. భర్త ప్రవర్తనతో విసుగు చెందిన సరస్వతి ఈస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్లింది. కానీ ఖాకీలు ఉదయం నుంచి కంప్లైంట్ తీసుకోకుండా కాలయాపన చేయడంతో మహిళ ఆవేదనతో స్టేషన్‌కు ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహాం వద్ద తన కుమారైతో కలిసి బైఠాయించి న్యాయం చేయాలని నిరసన చేపట్టింది.

పోలీసులు అక్కడికి చేరుకుని మహిళకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అదే సమయంలో రెండో భార్యతో ఆమె భర్త బైక్‌పై పోలీస్‌ స్టేషన్‌ వద్దకు చేరుకున్నాడు. ఇది చూసిన సరస్వతి ఆగ్రహంతో ఊగిపోయింది. పరుగున భర్త వద్దకు వెళ్లి లాగే ప్రయత్నం చేసింది. సరస్వతి బైక్‌ తాళం లాక్కునేందుకు యత్నించేసరికి వెంకట చలపతి అక్కడి నుంచి రెండో భార్యతో ఉడాయించాడు.

తండ్రిని పోలీస్‌ స్టేషన్‌ దగ్గర చూసిన ఆ చిన్నారి తల్లితో కలిసి.. అతడి వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించింది. 'డాడీ మా పక్కకు రా డాడీ..' అంటూ భోరున విలపించినా తండ్రి ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్లిపోయాడు. మరోవైపు తల్లి నడిరోడ్డుపై ఏడుస్తుండటంతో.. ఆ చిన్నారి ఆగ్రహం వ్యక్తం చేస్తూ .. 'అమ్మా డాడీని మర్చిపోమ్మా, నాకు డాడీ వద్దు.. ఆయన మీద కేసు వేసి విడాకులు ఇచ్చేయ్‌.. డాడీ నెంబర్‌ డిలీట్‌ చేయ్‌' అంటూ తల్లిని ఓదార్చే ప్రయత్నం చేసింది ఆ చిన్నారి.

Next Story
Share it