మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన అప్పలరాజు, వేణుగోపాలకృష్ణ

By సుభాష్  Published on  22 July 2020 8:43 AM GMT
మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన అప్పలరాజు, వేణుగోపాలకృష్ణ

ఏపీలో మంత్రివర్గ విస్తరణలో భాగంగా కొత్త మంత్రులుగా సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇద్దరు మంత్రులతో గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. విజయవాడలోని రాజ్‌భవన్‌లో మధ్యాహ్నం ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్‌, స్పీకర్‌ తమ్మినేని సీతారాం, మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ తదితరులు హాజరయ్యారు. కాగా, కరోనా వైరస్‌ కారణంగా ప్రమాణ స్వీకారానికి పరిమిత సంఖ్యలో నేతలు హాజరయ్యారు.

కాగా, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మోపిదేవి వెంకటరమణలు రాజ్యసభ సభ్యులుగా ఎన్నిక కావడంతో వారు మంత్రి పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వారి స్థానంలో అప్పలరాజు, వేణుగోపాలకృష్ణకు మంత్రివర్గంలో చోటు దక్కింది.

శ్రీకాకుళం జిల్లాకు చెందిన అప్పలరాజు 2019లో తొలిసారిగా పలాస నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మత్స్యకార వర్గానికి చెందిన మోపిదేవి స్థానంలో అదే సామాజిక వర్గం నుంచి అప్పలరాజుకు అవకాశం దక్కింది. అలాగే శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ స్థానంలో అదే సామాజిక వర్గం నుంచి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు మంత్రి పదవి దక్కింది.

Next Story