క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విండీస్ విధ్వంసకర ఆటగాడు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 4 Nov 2020 3:51 PM IST
విండీస్ విధ్వంసకర ఆటగాడు మార్లోన్ శామ్యూల్స్(39) అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. రెండు టీ20 ప్రపంచకప్‌ల విజయాల్లో మార్లోన్ కీలక పాత్ర పోషించాడు. రెండుసార్లు ఫైనల్ పోరులో అత్యధిక స్కోరు సాధించాడు. ఈ ఏడాది జూన్‌లో తన వీడ్కోలు గురించి వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు సమాచారం ఇచ్చాడు. 2018 డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌తో చివరి మ్యాచ్ ఆడాడు. 2012, 2016 టీ20 ప్రపంచకప్ ఫైనల్స్ రెండింటిలోనూ అత్యధిక స్కోరు సాధించి కరీబియన్ జట్టు కప్ గెలవడంలో ముఖ్యపాత్ర పోషించాడు.
కొలంబో వేదికగా జరిగిన 2012 వరల్డ్ టీ20 ఫైనల్లో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. ఆ మ్యాచ్‌లో 56 బంతుల్లో 78 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లోనూ అద్భుత గణాంకాలు(1/15) నమోదు చేయడంతో విండీస్ సునాయాస విజయాన్ని అందుకుంది.
అనంతరం కోల్‌కతాలో జరిగిన 2016 వరల్డ్ టీ20 ఫైనల్లోనూ అతడు సత్తాచాటాడు. ఇంగ్లాండ్‌తో తుదిపోరులో 66 బంతుల్లో 85 రన్స్ రాబట్టడంతో 4 వికెట్ల తేడాతో విండీస్ గెలుపొందింది. రెండు ఐసీసీ ఫైనల్ మ్యాచ్‌ల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికైన ఏకైక ఆటగాడు శామ్యూల్సే కావడం విశేషం.
ఇదిలావుంటే.. శామ్యూల్స్ విండీస్ జట్టు తరఫున శామ్యూల్స్ 71 టెస్టులు, 207 వన్డేలు, 67 టీ20లకు ప్రాతినిధ్యం వహించాడు. వన్డేల్లో 10 సెంచరీలు, 30 అర్ధ సెంచరీల సహాయంతో 5606 పరుగులు చేయగా.. టెస్టుల్లో 7సెంచరీలు, 24 అర్ధసెంచరీల సహాయంతో 3917 పరుగులు చేశాడు.