ప్లే ఆఫ్స్‌కు సన్‌రైజర్స్‌ హైదరాబాద్.. వికెట్ కోల్పోకుండా విక్ట‌రీ

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  4 Nov 2020 2:36 AM GMT
ప్లే ఆఫ్స్‌కు సన్‌రైజర్స్‌ హైదరాబాద్.. వికెట్ కోల్పోకుండా విక్ట‌రీ

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఐపీఎల్‌–2020లో లీగ్‌ దశను విజయవంతంగా అధిగమించి ప్లే ఆఫ్స్‌కు అర్హ‌త సాధించింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ 10 వికెట్ల తేడాతో గ‌త ఏడాది చాంఫియ‌న్‌ ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ముంబై బ్యాట్స్‌మెన్‌ల‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ (29 బంతుల్లో 36; 5 ఫోర్లు), ఇషాన్‌ కిషన్‌ (30 బంతుల్లో 33; 1 ఫోర్, 2 సిక్సర్లు), పొలార్డ్‌ (25 బంతుల్లో 41; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించారు. హైద్రాబాద్ బౌల‌ర్ల‌లో సందీప్‌ శర్మకు 3, షాబాజ్‌ నదీమ్ కు 2 వికెట్లు ద‌క్కాయి.

అనంతరం చేధ‌న‌కు దిగిన‌ హైదరాబాద్‌ 17.1 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 151 పరుగులు సాధించింది. కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ (58 బంతుల్లో 85 నాటౌట్‌; 10 ఫోర్లు, 1 సిక్స్‌), వృద్ధిమాన్‌ సాహా (45 బంతుల్లో 58 నాటౌట్‌; 7 ఫోర్లు, 1 సిక్స్‌) అజేయ బ్యాటింగ్‌ ప్రదర్శన కనబర్చి జట్టును గెలిపించారు. దీంతో శుక్రవారం జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో బెంగళూరుతో సన్‌రైజర్స్‌ తలపడనుంది. ఇదిలావుంటే.. ఈ మ్యాచ్‌కు బుమ్రా, బౌల్ట్ లను దూరంగా ఉంచింది టీం మేనేజ్‌మెంట్‌. దీంతో ముంబై బౌలింగ్ విభాగం హైద్రాబాద్ బ్యాట్స్‌మెన్‌ను ఏమాత్రం ఇబ్బంది పెట్టలేకపోయింది. ఫ‌లితంగా ప్లే ఆఫ్స్‌కు ముందు ఓట‌మిని మూట‌గ‌ట్టుకుంది.

Next Story