ప్రపంచ పాలిటిక్స్ మీద జుకర్ బర్గ్‌కు ఎంత పట్టు?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 8 Jun 2020 12:26 PM GMTఒక రంగంలో తిరుగులేని వ్యక్తికి.. అన్ని అంశాల మీద పట్టు ఉండటం కష్టమే. ఓవైపు టెక్నాలజీ.. మరోవైపు వ్యాపారం.. ఇంకోవైపు సామాజిక అంశాలు.. వీటన్నింటితో పాటు ప్రపంచ రాజకీయాల మీద అవగాహన ఉండటం.. తన మాటల్లో ఉదాహరణలతో సహా చెప్పటమంటే మామూలు విషయం కాదు. అందుకే కాబోలు జుకర్ బర్గ్ ఫేస్ బుక్ సీఈవో అయ్యారు. తాజాగా ఆయన తన ఉద్యోగులతో మాట్లాడే సందర్భంలో రాజకీయ నేతలు చేసే ద్వేష పూరిత ప్రసంగాలు.. వాటికి అనుగుణంగా వచ్చే కంటెంట్ వ్యాప్తి జరగకుండా ఉండేలా మరింత జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
పాతికవేల మంది ఉద్యోగులతో ఒకేసారి ఆన్ లైన్ లో ప్రసంగించిన ఆయన.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఢిల్లీకి చెందిన బీజేపీ నేత కపిల్ మిశ్రా పేరును ప్రస్తావించకుండానే.. ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యల్ని ప్రస్తావించారు. అంతటితో ఆగని ఆయన.. హాంకాంగ్ లోని ఒక ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావించటం చూసినప్పుడు ప్రపంచం చుట్టూ సరిగే అంశాలు మాత్రమే కాదు.. రాజకీయ పరిణామాల మీదా ఆయనకున్న పట్టు ఎంతన్నది అర్థమవుతుంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన సందర్భంలో ఢిల్లీ బీజేపీ నేత కపిల్ మిశ్రా చేసిన వ్యాఖ్యలు ఎంత సంచలనంగా మారాయో తెలిసిందే. సీఏఏకు వ్యతిరేకంగా షహీన్ బాగ్ లో పెద్దఎత్తున నిరసనల్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ పర్యటన సందర్భంగా నిరసనల్ని నిలిపివేయాలని కోరుతూ.. ‘‘పోలీసులకు మూడు రోజుల సమయం ఇస్తున్నాం. వారు పరిస్థితుల్ని అదుపులోకి తీసుకొనిరాకపోతే మా మద్దతుదారులు రంగంలోకి దిగి వీధులన్ని తుడిచిపెట్టేస్తారు’’ అని వ్యాఖ్యానించటాన్ని ప్రస్తావించారు. కాకుంటే.. కపిల్ మిశ్రా పేరును ఆయన ప్రస్తావించ లేదు. జుకర్ తన ప్రసంగంలో హాంకాంగ్ కు చెందిన ఒక శాసన సభా సభ్యుడి వ్యాఖ్యల్ని ఉదహరించారు.
‘‘రండి.. సమాజంలో పరిస్థితుల్ని మార్చాలంటూ నిరసన చేస్తున్న వారిని చంపేయండి’’ అని అన్నట్లు పేర్కొన్నారు. ఇలా పలు ఉదాహరణల్ని పేర్కొంటూ.. ద్వేషపూరిత ప్రసంగాలుకు సంబంధించిన కంటెంట్ ఫేస్ బుక్ లో లేకుండా చేసేందుకు చేయాల్సినవన్నీ చేయాలని తన ఉద్యోగులను కోరారు.