చైనా వస్తువుల బ్యాన్ ప్రాక్టికల్ గా సాధ్యమేనా?

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Jun 2020 11:47 AM GMT
చైనా వస్తువుల బ్యాన్ ప్రాక్టికల్ గా సాధ్యమేనా?

ప్రస్తుతం భారత్, చైనాల సరిహద్దులోని లడాఖ్ వద్ద ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో చైనా వస్తువులను బహిష్కరించాలని జోరుగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ప్రముఖ విద్యావేత్త సోనమ్ వాంగు చుక్ ట్వీట్ వీడియోతో భారతీయుల్లో చైనావస్తువుల వాడకంపై వ్యతిరేకత ఏర్పడింది. సోషల్ మీడియాలో #Boycottchineseproducts, #Boycottchina హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. డోక్లాం వద్ద రెండు సంవత్సరాల క్రితం ఏర్పడిన ఉద్రిక్తతల నేపథ్యంలోనూ ఇలాగే చైనా వస్తువులను బహిష్కరించాలని సోషల్ మీడియాలో ఓ ఉద్యమం నడిచింది. చైనాకు చెందిన వివో, ఒప్పో వంటి పలు ఫోన్ల షోరూమ్ లపై దాడి కూడా జరిగింది. ఆ దాడి జరిగిన కొన్ని రోజుల తర్వాత యథావిధిగా చైనా ఫోన్లను వాడుతున్నారు. మనదేశంలో వినియోగంలో ఉన్న ఫోన్లు, ఫోన్ల విడిభాగాలు, ఎలక్ట్రానిక్స్ సంబంధిత వస్తువుల్లో మెజారిటీ చైనాకు చెందినవే. ఇటువంటి సమయంలో చైనా వస్తువులను బహిష్కరించడం సాధ్యమేనా? ఒకవేళ బహిష్కరిస్తే తదనంతర పరిణామాలు ఎలా ఉంటాయి అన్నదానిపై దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చ జరుగుతోంది.

అయితే, చేదుగా ఉన్నా.. ఇప్పటికిపుడు చైనా వస్తువులను బ్యాన్ చేయడం సాధ్యం కాదన్నది వాస్తవం. చైనాకు మనం ఎక్స్ పోర్ట్ చేస్తున్న వాటికంటే.. చైనానుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నవే ఎక్కువ. భారత్ నుంచి చైనాకు 16.32 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులు ఎగుమతి అవుతున్నాయి. అయితే, చైనా నుంచి భారత్ 68 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంటోంది. 8 మిలియన్ డాలర్ల విలువైన ఫోన్లు భారత్ లోకి దిగుమతి అవుతున్నాయి. వివో, ఒప్పో, షామీ, లెనోవో ఫోన్లు భారత్ మార్కెట్లో 51 శాతం సేల్స్ కలిగి ఉన్నాయి. మొబైల్ ఫోన్ల తయారీ పరిశ్రమల్లో 70 శాతం విడిభాగాలు చైనా నుంచి దిగుమతి అవుతున్నాయి. 70 శాతం బల్క్ డ్రగ్స్ , వైద్య పరికరాలు, సోలార్ సెల్స్, ఇటువంటి పరిస్థితుల్లో చైనా వస్తువులను నిషేధించడం ఎలా సాధ్యమేనా? ఇటువంటి నేపథ్యంలో విదేశీ వస్తువుల బహిష్కరణ, స్వావలంబన భారత్ వంటివి చెప్పుకోవడానికి బాగుంటాయి కానీ, ప్రాక్టికల్ గా అమలు చేయడానికి సాధ్యపడవన్నది నిపుణుల వాదన.

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు నాటి.. నేటి ప్రభుత్వాలు ఎర్ర తివాచీ పరిచి మరీ స్వాగతం పలికాయి. అటువంటి సందర్భంలో విదేశీ వస్తువులు బహిష్కరించడం ఎలా సాధ్యపడుతుంది? అని వారు ప్రశ్నిస్తున్నారు. ఇక, చైనాలో ఫోన్ల విడిభాగాలు తయారైతే..ఆ కంపెనీల్లో యూరోపియన్ దేశాలు పెట్టుబడి పెట్టి ఉంటాయి. ఆ ఫోన్ తయారీ ఐడియా కొరియాది అయి ఉండవచ్చు.. దానిలో యాప్ప్ ఇండియాలో తయారు కావచ్చు. ఇలా, కచ్చితంగా ఇది చైనా వస్తువని చెప్పడం కష్టం. ఇవన్నీ పక్కనబెడితే.. స్వదేశీ వస్తువుల వాడకం అనేది మంచి కాన్సెప్టే. కానీ, ఇపుడు మన దేశం ఉన్న పరిస్థితుల్లో అది సాధ్యమేనా? మన దగ్గర అందుకు సంబంధించిన మౌలిక సదుపాయాలు కల్పించే వెసులుబాటు ఉందా? గతంలోనూ జపాన్ వస్తువులను చైనా.. ఫ్రాన్స్ వస్తువులను అమెరికా బ్యాన్ చేయాలని చూసి విఫలమయ్యాయి. అయితే, క్రమక్రమంగా విదేశీ వస్తువుల వాడకం తగ్గించుకుంటూ వాటిని భారత్ లో తయారు చేసుకోవడం వంటివి చేసిన తర్వాత విదేశీ వస్తువుల బహిష్కరణ గురించి మాట్లాడడం ఉత్తమం అన్నది ఆర్థిక నిపుణుల వాదన. భారత్, చైనాల మధ్య వ్యాపారంలో తేడా చాలా తక్కువగా ఉన్పుపుడే మనం చైనా వస్తువులను పూర్తిగా బ్యాన్ చేయగలమన్నది కఠోర వాస్తవం.

Next Story