కారును లాక్కెళ్లిన సముద్రపు అలలు.. అతడి తెగింపు మాత్రం.!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  3 Jun 2020 12:53 PM GMT
కారును లాక్కెళ్లిన సముద్రపు అలలు.. అతడి తెగింపు మాత్రం.!

వేసవి కాలంలో ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందడానికి ప్రజలు ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. కొందరు ఈత కొలనులో ఈదడం, శీతల ప్రదేశాల్లో విహరించడం, సముద్రపు ఒడ్డున సేద తీరడం లాంటివి చేస్తుంటారు. విదేశాలలో బీచ్ లలో సేదతీరే వారే చాలామంది ఉంటారు. అందరి లాగే ఒకతను బీచ్ లో సేద తీరడానికి కారులో వచ్చాడు. తన కారును ఒడ్డున ఉంచి అలలమీద స్వారీ చేయడానికి "జెట్ స్కి" కిందకు దించుకుంటూ ఉండగా.. ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. కారు అదుపుతప్పి సముద్రంలోకి వెళ్లిపోగా.. దాన్ని తిరిగి తీసుకుని రావడానికి ఆ వ్యక్తి పెద్ద సాహసమే చేశాడు.

ఈ సంఘటన యూకే లో జరిగింది. "డైలీ మెయిల్" ప్రకారం కెంట్ వాస్తవ్యుడైన "లీ డాల్బీ" అనే వ్యక్తి తనకు బీచ్ లో జరిగిన వింత అనుభవాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. 40 ఏళ్ల లీ డాల్బీ "ఓక్స్ వాఘన్ గోల్ఫ్" కారు అలల తాకిడికి సముద్రంలోకి మెల్లగా కొట్టుకొని వెళ్ళింది. ఇది చూసి అవాక్కైన లీ డాల్బీ ఎలాగైనా తన కారును తిరిగి ఒడ్డుకు తీసుకొని రావడానికి విశ్వ ప్రయత్నాలు చేశాడు. మనిషి అనుకుంటే చేయలేనిది అంటూ ఏదీ ఉండదు కదా.. ఆఖరికి అనుకున్నది సాధించాడు. కారుకు తాళ్ల్లు కట్టి ఒడ్డుకు చేర్చడానికి లీ డాల్బీ కి బీచ్ లో ఉన్నవారు సాయం చేయడం విశేషం. కొందరేమో నిరుత్సాహ పరిచే వ్యాఖ్యలు చేశారు.. ఒడ్డున ఒకతను అతడు తన కారును పోగొట్టుకుంటాడేమో అని అంటున్న మాటలు కెమెరా లో రికార్డ్ అయ్యాయి. కానీ చివరికి డాల్బీ అనుకున్నది సాధించాడు. తిరిగి తన కారును ఒడ్డుకు తెచ్చేసుకున్నాడు.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డాల్బీ ప్రయత్నాన్ని అందరూ ప్రశంసించారు. ఈ వీడియో ఫేస్ బుక్ లో దాదాపు 3.6 లక్షల మంది వీక్షించారు.

Next Story