ఎర్ర జెండా రెపరెపలు అడవులకే పరిమితమా..?!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 Sep 2019 2:26 PM GMT
ఎర్ర జెండా రెపరెపలు అడవులకే పరిమితమా..?!

పొడుస్తున్న పొద్దు మీద గానంతోపాటు వారూ నడుస్తూనే ఉన్నారు. బిగించిన పిడికిలి పట్టు వదల్లేదు. ఎత్తిన జెండా దించలేదు. తుపాకి గుళ్లు కంటే వేగంగా పోవాలనే తపన.దశాబ్డాల ప్రస్థానంలో వారు సాధించింది ఏంటని చూస్తే పెద్ద ప్రశ్నే కళ్ల ముందు కదలాడుతుంది. వారే మావోయిస్టులు. ఎర్ర జెండా రెపరెపలు, మావో భావజాలం పచ్చని అడవులకే పరిమితం అయ్యాయి. పీపుల్స్ వార్‌ పార్టీ, బిహార్‌కు చెందిన కమ్యూనిస్ట్ సెంటర్‌ మావోయిస్ట్ పార్టీలు విలీనమై సెప్టెంబర్ 21కి 15 ఏళ్లు . ఈ సందర్భంగా మావోల ప్రస్థానంపై ప్రత్యేక కథనం.

వాళ్ల కళ్లల్లో నెత్తుటి చారాలు..నేల మీద ఎర్రవాగులై పారాయి. వారి గుండెల్లో పురుడు పోసుకున్న పాటలు..గిరిజన గూడెలకు గొడుగులయ్యాయి.వారి నినదించిన నినాదం అడవి దాటి బయటకు రావడం లేదు. ప్రాణాలు పోతున్నాయి..కాలం నడిచిపోతుంది..లక్ష్యం కానరావడం లేదు. ఈ 15 ఏళ్లలో మావోలు సాధించింది ఏంటీ?. అడవిపై పెత్తనమా? అణగారిన వర్గాలకు అండనా?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పీపుల్స్‌వార్‌ పార్టీగా కొండపల్లి సీతరామయ్య నాయకత్వంలో అవతరించింది. ఆ పార్టీ సెప్టెంబర్‌ 21, 2004న బిహార్‌ ఎంసీసీని తనలో విలీనం చేసుకొని మావోయిస్టు పార్టీగా అవతరించింది. 1979 జగిత్యాల జైత్రయాత్ర నక్సలిజానికి తెలుగు గడ్డపై ఊపిరులూదింది. అప్పటి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తోపాటు మహారాష్ట్ర, చత్తీశ్‌గఢ్, తమిళనాడు రాష్ట్రాలకు విస్తరిస్తూ కశ్మీర్‌ కొండల వరకు పాకింది. అంతేకాదు..బిహార్ , జార్ఖండ్‌ల్లో ఒక బలమైన పార్టీగా అవతరించారు .

ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 2004లో శాంతి చర్చలకు తెరలేపింది. ఒక పక్క ప్రభుత్వంతో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. మరోపక్క నక్సల్స్‌ అగ్రనేతలు రామకృష్ణ, సుధాకర్‌ హైదరాబాద్‌లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తమ పార్టీ ఇకపై మావోయిస్టు పార్టీగా కొనసాగుతుందని హైదరాబాద్‌ నుంచే ప్రకటించారు . శాంతి చర్చలు ముగిసిన అనంతరం మావోయిస్టులు తిరిగి అజ్ఞాతవాసం వెళ్లారు.

మావోయిస్టులను టార్గెట్ చేసిన అన్ని రాష్ట్రాలు

పీపుల్స్‌ వార్‌గా ఉన్నప్పటి కంటే..మావోయిస్ట్‌ పార్టీగా ఏర్పడిన తరువాతనే అన్ని రాష్ట్రాలు మావోలపై ఒత్తిడి పెంచాయి. రాష్ట్ర, కేంద్ర బలగాలు ఒకేసారి రంగంలోకి దిగాయి. దీంతో ఉమ్మడి ఏపీలో బలంగా ఉన్న మావోలు తరువాత కాలంలో తమ బలాన్ని కోల్పోయారు. అంతేకాదు..పోలీసులు పక్కా వ్యూహంతో అడుగులు వేశారు. కొత్త టెక్నాలజీ సాయంతో మావోల జాడ కనుక్కుంటూ.. అగ్రనేతలను తుదముట్టించారు.

మావోయిస్టు పార్టీ కార్యదర్శి రామకృష్ణ బదిలీ తర్వాత ఆయన స్థానంలో వచ్చిన బుర్ర చిన్నన్న, శాఖమూరి అప్పారావు, పటేల్‌ సుధాకర్‌ రెడ్డి, నల్లమల్ల సాగర్, దేవేందర్‌ ఇలా వరుసగా రాష్ట్ర పార్టీ కార్యదర్శులంతా ఎన్‌కౌంటర్లలో హతమయ్యారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మావోలు వెనకడుగు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాని..ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, మహారాష్ట్ర తూర్పు ప్రాంతాల్లో మావోలు తమ ఉనికిని చాటుకుంటున్నారు. వారోత్సవాల నేపథ్యంలో కదలికలు ఉంటాయన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

Next Story