మావోయిస్టు పార్టీ అగ్రనేత.. గణపతి అలియాస్ ముప్పాల లక్ష్మణరావు వార్తల్లోకి వచ్చారు. వయోభారంతో పాటు.. ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ఆయన తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు. తెలంగాణ పోలీసుల చొరవ.. ప్రధాని మోడీ సర్కారు సానుకూలంగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఎదుట లొంగిపోయేందుకు సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు. 74 ఏళ్ల గణపతి రెండేళ్ల క్రితమే మావో పార్టీ నుంచి బయటకు వచ్చేశారు.

ఉబ్బసం.. మోకాళ్ల నొప్పులు.. మధుమేహంతో పాటు తీవ్ర అస్వస్థతతో ఉన్న ఆయన్ను ఎక్కడకు తీసుకెళ్లాలన్నా.. మోసుకుపోవటమే తప్పించి మరో పరిస్థితి లేకపోవటంతో ఆయన ప్రభుత్వానికి లొంగిపోవటమే మంచిదన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన రాజీ చర్చలు చివరి దశలో ఉన్నట్లు సమాచారం.

గణపతి లొంగుబాటు సాఫీగా సాగేలా తెలంగాణ పోలీసులు చొరవ చూపిస్తున్నారని.. ఈ విషయంలో మోడీ సర్కారు సైతం పాజిటివ్ గా ఉన్నట్లు చెబుతున్నారు. కరోనా.. ఆర్థిక సంక్షోభం.. చైనా ఇష్యూల నేపథ్యంలో గణపతి లొంగిపోవటం రాజకీయంగా తమకు సానుకూలం అవుతుందన్న ఆలోచనలో కేంద్రం ఉన్నట్లుగా చెబుతున్నారు. ఏమైనా.. అనారోగ్యంతో ఉన్న గణపతి ప్రభుత్వం ఎదుట లొంగిపోయే అవకాశాలు త్వరలోనే వాస్తవ రూపం దాలుస్తాయని చెబుతారు. టీచరుగా మొదలైన ఆయన జీవితం.. మావోల సిద్ధాంతాలకు హాజరుకావటమే కాదు.. చాలా త్వరగా పార్టీ కేంద్ర కమిటీ స్థానానికి వేగంగా ఎదిగారు.

జగిత్యాల జిల్లా బీర్ పూర్ కు చెందిన ఆయన 1973లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం వచ్చింది. రుద్రంగిలో పని చేస్తున్న వేళలో 1975లో ఆయనకు బీఈడీ సీటు రావటంతో వరంగల్ కు వెళ్లారు. ఆ సమయంలోనే ఆయన మావోల పట్ల ఆకర్షితులైనట్లు చెబుతారు. పలు హత్య కేసుల్లో ఆయన పేరు ఉంది. 1977లో జగిత్యాల జైత్రయాత్ర కోసం చందాలు వసూలు చేయటం.. ఉప్పుమడిగె రాజేశ్వర్ రావు.. చిన్నమెట్ పల్లి జగన్మోహన్ రావు హత్య కేసులు నమోదైన తర్వాత అరెస్టు అయ్యారు. తర్వాత బెయిల్ పొందిన ఆయన అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయారు.

1990-91లో పీపుల్స్ వార్ పార్టీలో చీలికలు వచ్చాయి. 2005లో నూతనంగా ఏర్పాటు చేసిన మావోయిస్టు పార్టీకి గణపతి కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. సుదీర్ఘకాలం బాధ్యతలు నిర్వర్తించిన ఆయన తలపై మహారాష్ట్ర ప్రభుత్వం కోటి నజరానాను ప్రకటించటం గమనార్హం. ఆయనకుభార్య.. కుమారుడు ఉన్నారు. వయోభారంతో ఆయన ప్రభుత్వం ఎదుట లొంగిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. త్వరలోనే అది పూర్తి అవుతుందని తెలుస్తోంది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.