ఆన్‌లైన్ కేటుగాళ్లు: మోసపోయిన మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ సలహాదారు
By సుభాష్ Published on 29 Jun 2020 10:09 AM ISTదేశంలో మోసగాళ్లు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఆన్‌లైన్‌లో కేటుగాళ్లు కొందరికి వల వేసి నిలువునా మోసగిస్తున్నారు. ఈ ఆన్‌లైన్ కేటుగాళ్లు ఏకంగా దేశ మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ మాజీ సలహాదారునే నిలువునా మోసగించారు. మన్మోహన్‌సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో సంజయ్‌బారు ఆయన వద్ద సలహాదారుగా పని చేశారు. అయితే లాక్‌డౌన్ సమయంలో లిక్కర్ హోమ్ డెలివరీ చేసే కంపెనీలు ఏమైనా ఉన్నాయా అని ఆన్‌లైన్‌లో వెతికారు. ఈ క్రమంలోనే ఆయన లా కావా వైన్స్ అండ్‌స్పిరిట్స్ అని ఓ కంపెనీ పేరు కనిపించింది. అందులో ఇచ్చిన ఫోన్‌కు ఫోన్ చేసి మద్యం కావాలని అడగడంతో, ముందస్తుగా రూ.24వేలు చెల్లించాలని, అయితే మద్యాన్ని డోర్ డెలివరీ చేస్తామని చెప్పారు. అది కూడా ఆన్‌లైన్‌లో చెల్లించాలని చెప్పడంతో సంజయ్‌బారు అడిగిన మొత్తాన్ని ఆన్‌లైన్‌లో చెల్లించాడు. ఆ తర్వాత లిక్కర్ డోర్ డెలివరి కాకపోవడంతో వెంటనే సంబంధిత నెంబర్‌కు ఫోన్ చేయగా, అది స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో షాక్‌కు గురైన బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఇక రంగంలోకి దిగిన పోలీసులు ఆన్‌లైన్‌లో ఇచ్చిన నెంబర్ ఆధారంగా దర్యాప్తు చేయగా, ఓ క్యాబ్ డ్రైవర్‌గా గుర్తించి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. విషయం ఆరా తీయగానే తానే ఈ పని చేసినట్లు డ్రైవర్ ఒప్పుకొన్నాడు. తన మిత్రుడితో కలిసి దొంగ గుర్తింపు కార్డులతో సిమ్ కార్డులను తీసుకుని ఈ దందాకు పాల్పడుతున్నామని పోలీసుల ముందు పేర్కొన్నాడు. ఇలా లిక్కర్‌ను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తామనంటూ ఆన్‌లైన్ ద్వారా పేమెంట్ చేయించి మోసం చేస్తున్నామని అంగీకరించారు.
అలాగే నిందితుడు పలు రాష్ట్రాల్లో వేర్వేరుగా బ్యాంకుల్లో అకౌంట్లు నిర్వహిస్తున్నాడు. ఇక ఆన్‌లైన్‌లో డబ్బులు రాగానే మళ్లీ వాటిని డిజిటల్ రూపంలో వేర్వేరు అకౌంట్లకు బదిలీ చేసి ఆ డబ్బులను తమ సొంత ఖాతాల్లోకి మళ్లించుకుంటామని తెలిపాడు.