నూత‌నోత్సాహంలో టీ కాంగ్రెస్‌.. నేడు హైదరాబాద్‌కు కొత్త‌ ఇన్‌చార్జి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 Sep 2020 6:35 AM GMT
నూత‌నోత్సాహంలో టీ కాంగ్రెస్‌.. నేడు హైదరాబాద్‌కు కొత్త‌ ఇన్‌చార్జి

తెలంగాణ‌ కాంగ్రెస్ ఇన్‌చార్జి మాణికం ఠాగూర్ శ‌నివారం సాయంత్రం హైద్రాబాద్‌కు రానున్నారు. కుంతియా స్థానంలో మాణికం ఠాగూర్‌ను తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జిగా కాంగ్రెస్ హైకమాండ్ నియమించింది. వియామ‌కం తర్వాత తొలిసారిగా ఆయన హైద్రాబాద్ వస్తున్నారు. ఈ విష‌య‌మై ఆయ‌న‌కు టీపీసీసీ ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమైంది. మూడు రోజుల పాటు ఠాగూర్ హైద్రాబాద్‌లోనే ఉండనున్నారు. ఈ నెల 28న రైతు బిల్లుకు వ్యతిరేకంగా గాంధీభవన్ నుంచి రాజ్ భవన్ వరకు కాంగ్రెస్ తలపెట్టిన నిరసన ర్యాలీలో ఆయ‌న‌ పాల్గొననున్నారు.

ఇదిలావుంటే.. తెలంగాణ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్‌ అధిష్ఠానం.. తాజాగా కొత్త రక్తాన్ని ఎక్కించేందుకు పావులు కదుపుతోంది. ఆర్నెల్ల పాటు సోనియా సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ నడవాలన్న నిర్ణయం ఇటీవల తీసుకోవటం తెలిసిందే. దీనికి ముందు సీనియర్లు పలువురు కలిసి లేఖ రాయటంతో చోటు చేసుకున్న కలకలం అంతా ఇంతా కాదు. రాహుల్ గాంధీని టార్గెట్ చేసేలా ఉన్న ఈ లేఖపై సోనియా సైతం తీవ్ర ఆగ్రహాంతో ఉన్నట్లు చెబుతున్నారు.

పార్టీని ప్రక్షాళన చేసేందుకు వీలుగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు సోనియాగాంధీ. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ గా ఉన్న కుంతియా స్థానంలో మాణిక్యం ఠాగూర్ ను అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్న కుంతియాను పక్కన పెట్టి.. యువకుడైన మాణిక్యంకు పార్టీ బాధ్యత అప్పగించటం చూస్తే.. కాంగ్రెస్ లో యువ రక్తాన్ని నింపాలన్న యోచనలో అధినాయకత్వం ఉన్నట్లుగా చెప్పాలి.

సీనియర్లు.. వయసు మళ్లిన వారిని పక్కన పెట్టేసి.. యువ నాయకత్వాన్ని ఎంపిక చేస్తున్న క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జీగా మాణిక్యం పేరును ఫైనల్ చేసినట్లుగా చెబుతున్నారు. తమిళనాడుకు చెందిన ఈ కాంగ్రెస్ నేత.. పార్టీ అనుబంధ విద్యార్థి విభాగమైన ఎన్ఎస్‌యూఐలో విద్యార్థి నాయకుడిగా తన పొలిటికల్ కెరీర్ షురూ చేశారు.

తర్వాతి కాలంలో ఆల్ ఇండియా ఎన్ఎస్‌యూఐ జనరల్ సెక్రటరీగా.. ఉపాధ్యక్షుడిగా బాధ్యతల్ని నిర్వర్తించిన ట్రాక్ రికార్డు ఉంది. 2009లోనూ 2019లోనూ రెండు దఫాలు తమిళనాడు విరుధానగర్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. తీసిపారేయలేని ట్రాక్ రికార్డు ఉన్న మాణిక్యం ఠాగూర్ ఎంపిక.. టీ కాంగ్రెస్ నేతలలో నూత‌నోత్సాహం నింపి అధికారం చేజిక్కించుకునే దిశ‌గా అడుగులు ప‌డ‌తాయో, లేదో వేచి చూడాలి మ‌రీ.

Next Story