మందుబాబులకు శుభవార్త.. నేటి నుంచి తెరుచుకోనున్న బార్లు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Sep 2020 3:55 AM GMT
మందుబాబులకు శుభవార్త.. నేటి నుంచి తెరుచుకోనున్న బార్లు

మందుబాబులకు శుభవార్త ఇది. తెలంగాణలో ఇవాళ్టి నుంచి బార్‌లు, క్లబ్‌లు తెరుచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు నియమ నిబంధనలతో కూడిన జీవోను శుక్రవారం జారీ చేసింది. లాక్‌డౌన్‌ కారణంగా గత ఆరునెలలుగా బార్లు మూతపడిన విషయం తెలిసిందే. క్లబ్‌లలో ఈవెంట్స్‌, డ్యాన్స్‌లకు అనుమతి ఇవ్వలేదు. శనివారం నుంచి బార్లు తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కరోనా గైడ్‌లైన్స్‌ని పాటిస్తూ మాత్రమే తెరచుకోవాలని కండీషన్‌ పెట్టింది. అయితే మద్యం దుకాణాల పర్మిట్‌ గదులకు మాత్రం అనుమతి ఇవ్వలేదు. బార్‌ నిర్వాహకులు, సిబ్బంది తప్పని సరిగా మాస్క్‌లు వాడాలి. బార్లలో, క్లబ్బుల్లో ఎక్కువ మంది ఒకే దగ్గర మూగడం, మ్యూజిక్‌ కార్యక్రమాలు, డాన్స్‌ ఫ్లోర్‌లు ఏర్పాటు చేయడం ఉండవు. కస్టమర్లు వచ్చేముందు ప్రతి బార్‌లోపల, బయటా ఉదయం, సాయంత్రం వేళల్లో పూర్తిస్థాయిలో శానిటైజేషన్‌ చెయ్యాలి.

కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలతో ఇవాళ్టి నుంచి అర్బన్ ఫారెస్ట్ పార్కులు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఈ విషయం తెలిపారు. నగర పట్టణ వాసులు ఈ సదుపాయాల్ని వాడేసుకోవాలని సూచించారు. కరోనా రూల్స్ పాటిస్తూ సందర్శకులకు సానిటైజర్లను అందుబాటులో ఉంచాలని, మాస్కులు ధరించిన వారినే లోపలికి అనుమతించాలని అటవీ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. అక్టోబర్ 6ను జూ డే కాబట్టి... ఆ రోజు నుంచి నెహ్రూ జూ పార్క్ లోకి సందర్శకులను అనుమతిస్తామని మంత్రి చెప్పారు. అందుకు తగ్గట్టుగా జూ పార్కు అధికారులు శుభ్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

Next Story