మంచు లక్ష్మి పెళ్లి ముచ్చట్లు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 30 May 2020 10:16 AM ISTసెలబ్రెటీల వ్యక్తిగత వ్యవహారాలపై జనాలకు భలే ఆసక్తి ఉంటుంది. వాళ్ల ప్రేమ, పెళ్లి లాంటి విషయాలపై అమితాసక్తిని ప్రదర్శిస్తారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే మంచు లక్ష్మీ ప్రసన్న తాజాగా సోషల్ మీడియా ద్వారా తన పెళ్లి ముచ్చట్లు పంచుకుంది. అమెరికాలో స్థిరపడ్డ ఎన్నారై ఆండీ శ్రీనివాసన్‌తో మంచు లక్ష్మి పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ టైంలో తన పెళ్లి ఆల్బమ్‌ను బయటికి తీసిన మంచు లక్ష్మి అందులోంచి కొన్ని ప్రత్యేకమైన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. లక్ష్మి పెళ్లి కూతురిగా ముస్తాబైన.. తల్లిదండ్రులతో కలిసి తీసుకున్న ఫొటోలు భలే ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ఇక పెళ్లి అనుభవాల గురించి చెబుతూ.. ఆ రోజు తాను కంగారు పడ్డట్లు లక్ష్మి వెల్లడించింది.
'పెళ్లి రోజు చాలా కంగారుగా అనిపించింది. పెళ్లి కూతురిగా సిద్ధమై వేదిక దగ్గరకు వచ్చే సరికి చాలా బిడియంగా అనిపించింది. గంట సేపు చాలా కంగారు పడ్డా. బయటకు వెళ్లిపోయే దారి కోసం సీరియస్‌గా వెతికాను అని మంచు లక్ష్మి పేర్కొంది. ఆండీ శ్రీనివాసన్‌తో లక్ష్మి పెళ్లి 2006లో జరిగింది. అమెరికాలోనే ఉన్నత విద్యాభ్యాసం చేసి.. అక్కడే కొన్ని టీవీ షోలు చేసిన మంచు లక్ష్మి పెళ్లి తర్వాత అక్కడే స్థిరపడింది. ఆండీకి అక్కడ కొన్ని వ్యాపారాలున్నాయి. ఐతే తర్వాత హైదరాబాద్ వచ్చేసిన లక్ష్మి.. ముందు ఓ టీవీ ఛానెల్లో టాక్ షోతో తన ప్రస్థానాన్ని ఆరంభించింది. ఆపై సినిమాలు నిర్మించింది. సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె సినిమాలకు కొంచెం దూరంగానే ఉంది. లాక్ డౌన్ టైంలో ఆన్ లైన్లో వెబినార్స్ నిర్వహిస్తోంది. ఆండీ, లక్ష్మీలకు సరోగసీ ద్వారా పుట్టిన అమ్మాయికి మంచు విద్యా నిర్వాణ అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే.