మామకు కరోనా.. అల్లుడిపై కేసు.. ట్విస్ట్ ఏంటంటే..?
By తోట వంశీ కుమార్ Published on 14 April 2020 3:36 PM IST
కరోనా వైరస్ రోజు రోజుకు విజృంభిస్తోంది. ఈ మహమ్మారి వ్యాప్తిని నిరోధించడానికి దేశవ్యాప్త లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. కరోనాని అడ్డుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు సైతం కఠిన నిబంధనలను అమలు చేస్తున్నాయి. ఎవరైనా నిబంధలను ఉల్లంగిస్తే శిక్షలు విధిస్తున్నాయి. తాజాగా ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన మామని చూడడానికి వెళ్లాడు. ఇన్ని ఆంక్షలు ఉన్నా సరే.. ప్రకాశం జిల్లా చీర్యాల నుంచి గుంటూరు వెళ్లి మరీ చూసోచ్చాడు. దీంతో సదరు అల్లుడిపై కేసు నమోదు అయ్యింది.
ప్రకాశం జిల్లా చీర్యాలకు చెందిన ఓ వ్యక్తి లాక్‌డౌన్‌కు ముందు తన కుమారుడిని తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా మిట్టపల్లిలోని తన మామ గారి ఇంటింటికి పంపించాడు. అనంతరం లాక్‌డౌన్‌ను ప్రకటించారు. కాగా.. మామగారికి ఇటీవల గుండెపోటు రావడంతో ఆయన్ను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. మామని పరీక్షించిన డాక్టర్లు.. కరోనా పాజిటివ్ గా నిర్థారించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మామగారిని చూడడానికి ఆ అల్లుడు లాక్‌డౌన్ నిబంధనలను అతిక్రమించి మరీ వచ్చాడు. మామ గారిని పరామర్శించి అక్కడే ఉన్న తన నాలుగేళ్ల కుమారుడిని తీసుకుని ఇంటికి వెళ్లిపోయాడు. కరోనా విషయాన్ని ఎవరికి చెప్పకుండా గోప్యంగా ఉంచారు. సమాచారం అందుకున్న పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం అతడి కుటుంబ సభ్యులను క్వారంటైన్‌కు పంపించారు.