పరదా గెట్‌లో టెన్షన్.. కరోనా పాజిటివ్‌ వ్యక్తి ఇంట్లో 46 మంది.!

By అంజి
Published on : 5 April 2020 8:29 AM IST

పరదా గెట్‌లో టెన్షన్.. కరోనా పాజిటివ్‌ వ్యక్తి ఇంట్లో 46 మంది.!

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ వైరస్‌ తీవ్రత కూడా జిల్లాలకు విస్తరిస్తోంది. ప్రస్తుతం పాజిటివ్‌గా నమోదు అవుతున్న కేసులన్నీ మర్కజ్‌ నుంచి వచ్చిన వారు లేదా వారితో కలిసిన వారు మాత్రమేనని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లిన వారి కోసం పోలీసులు, హెల్త్‌టీమ్‌లు ఇంటింటికి తిరుగుతూ విచారణ చేపడుతున్నాయి.

నగరంలోని పరదా గెట్‌లో టెన్షన్‌ టెన్షన్‌ వాతావరణం నెలకొంది. నారాయణగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కింగ్‌ కోఠి పరదా గెట్‌ ప్రాంతానికి చెందిన ఆరుగురు మార్చ్‌ 12న ఢిల్లీలో జరిగిన ప్రార్థనలకు హాజరయ్యారు. ఆ తర్వాత ఈ నెల 18న వారు హైదరాబాద్‌కు తిరిగి వచ్చినట్లుగా అధికారులు గుర్తించారు. గత నాలుగు రోజుల క్రితం వారిని అధికారులు పరీక్షల నిమిత్తం అమీర్‌పేట్‌ నేచర్‌క్యూర్‌ ఆస్పత్రికి తరలించారు. అందులో ఒకరికి కరోనా వైరస్‌ పాజిటివ్‌ అని తేలింది. మిగిలిన ఐదుగురి రిజల్ట్స్‌ రావాల్సి ఉంది. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి ఇంట్లో 46 మంది కుటుంబ సభ్యులు నివసిస్తున్నారు. కరోనా బాధితుడిది ఉమ్మడి కుటుంబం. కాగా గాంధీ వైద్యుల పర్యవేక్షణలో అతని ఇంట్లోని మిగిలిన కుటుంబ సభ్యులకు వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ఆ ఆరుగురు ఎవరెవరిని కలిశారో అని స్థానికులు భయపడుతున్నారు. ఆ 46 మంది కుటుంబ సభ్యులకు చేతిపై క్వారంటైన్‌ స్టాంప్‌ వేసి ఇంటి నుంచి బయటకు రావొద్దని అధికారులు సూచించారు. కరనా పాజిటివ్‌ అని నిర్దారణ అయితే ఆస్పత్రికి తరలిస్తామని చెప్పారు. ఢిల్లీ వెళ్లి వచ్చిన మిగిలిన ఐదుగురి కుటుంబాలకు కూడా కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించనున్నారు వైద్యులు.

శనివారం తెలంగాణలో మరో 43 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 272కు చేరింది. ఇప్పటి వరకు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొంది 33 మంది డిశ్చార్జి అయ్యారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ వైరస్‌ బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 11కు చేరింది. మర్కజ్‌ నుంచి 1090 మంది రాష్ట్రానికి వచ్చారు. వారందరినీ కూడా క్వారంటైన్‌లో ఉంచి పరీక్షలు నిర్వహిస్తున్నామని ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Next Story