కూతురి పట్ల పశువులా ప్రవర్తించిన ఆ తండ్రికి 20 ఏళ్ల జైలుశిక్ష..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 3 Dec 2019 8:54 PM ISTదేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'జస్టిస్ ఫర్ దిశా' వివాదం నడుస్తుండగానే విజయవాడ స్పెషల్ కోర్టు ఓ రేప్ కేసులో సంచలన తీర్పు చెప్పింది. కన్నకూతురు లాంటి మైనర్ బాలికపై దారుణానికి ఒడిగట్టిన మారు తండ్రికి కోర్టు ఇరవై ఏళ్ళ జైలు శిక్ష విధించింది. కోర్టు తీర్పుపై తెలుగు రాష్ట్రాల్లో హర్షం వ్యక్తమవుతోంది.
వివరాళ్లోకెళితే.. సైకం కృష్ణారావు అనే వ్యక్తి ఇబ్రహీంపట్నం వాస్తవ్యుడు. ఓ ప్రవేట్ ఫ్యాక్టరీలో పనిచేస్తుండేవాడు. అదే ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఓ భర్త లేని ఇద్దరు బిడ్డల తల్లిపై మనసుపడ్డాడు. భార్యలేదని, ఒప్పుకుంటే పెళ్లిచేసుకుంటానని ఆమెతో చెప్పాడు. ని పిల్లల్ని సొంతబిడ్డల్లా చూసుకుంటానని నమ్మించి వివాహం చేసుకున్నాడు. పదకొండేళ్ళు వీరిద్దరి సంసారం సాఫీగానే సాగింది.
అయితే.. రోజులు అలా గడుస్తుండగా.. మారుతండ్రి కృష్ణారావు కన్ను పదో తరగతి చదువుతున్న కూతురిపై పడ్డది. తల్లి పనికి వెళ్లిన టైం చూసి కూతురిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. తండ్రి స్థానంలో ఉన్నాను.. వరుసకు కూతురు అవుతుందన్న ఆలోచన కూడా లేకుండా పశువులా కామవాంఛ తీర్చుకొన్నాడు.
తల్లి ఇంటికి రాగానే కూతురు ఏడుస్తూ జరిగిన విషయం చెప్పడంతో... ఆ తల్లి కృష్ణారావుకి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పచెప్పింది. పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి వేగంగా దర్యాప్తు చేయడంతో ఏడాది లోపే కేసు విచారణ జరిపి.. కృష్ణారావును దోషిగా తేల్చారు. విజయవాడలోని స్పెషల్ కోర్టు న్యాయమూర్తి అతనికి ఇరవై ఏళ్ల కఠిన కారాగార శిక్ష, ఐదువందల జరిమానా విధించారు. దేశవ్యాప్తంగా దిశా హత్యాచార కేసుపై పోరాటం జరుగుతున్న నేపథ్యంలో ఇటువంటి తీర్పు వెలువడటంతో సర్వత్రా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.