ఈసీఐఎల్‌లో విషాదం.. నడిరోడ్డుపై యువకుడి మృతి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 July 2020 3:21 PM IST
ఈసీఐఎల్‌లో విషాదం.. నడిరోడ్డుపై యువకుడి మృతి

కరోనా దెబ్బకి ఎదుటి వారికి సాయం చేసేందుకు కూడా జనం జంకుతున్నారు. ఓ యువకుడు నడిరోడ్డుపై పడిపోతే.. అతడికి సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. చివరికి 108 సిబ్బంది వచ్చి ఆస్పత్రి తరలించే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. అప్పటికే ఆ యువకుడి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ విషాద ఘటన ఈసీఐఎల్‌ చౌరస్తాలో బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. యువకుడి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతుడిని జవహర్‌నగర్‌కు చెందిన పృథ్వీరాజ్‌గా గుర్తించారు.

గత మూడు రోజులుగా జ్వరం రావడంతో అతడిని స్థానికంగా ఉండే ఆస్పత్రికి తీసుకెళ్లారు. అతడిని పరీక్షించిన వైద్యలు పెద్దాసుపత్రికి తరలించాలని సూచించారు. దీంతో వారు ఆటోలో తరలించేందుకు యత్నిస్తుండగా.. యువకుడు నడిరోడ్డుపై కింద పడ్డాడు. అయితే.. చుట్టుప్రక్కల ఉన్న వాళ్లు దూరంగా నిలబడి చూశారే తప్ప అతడికి సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. 108 సిబ్బందికి వచ్చి అతడిని ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించగా.. ఆ యువకుడు అప్పటికే మృతి చెందాడు.

Next Story