కరోనా భయం: యువకుడు ఆత్మహత్య

By సుభాష్  Published on  25 March 2020 8:46 AM GMT
కరోనా భయం: యువకుడు ఆత్మహత్య

కరోనా.. ఈ పేరువింటేనే గజగజ వణికిపోవాల్సిందే. కరోనా భయంతోనే యువకుడు సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని గొల్లవీధికి చెందిన మహేష్ (23) గత సంవత్సరం బతుకుదెరువు కోసం బ్రహెయిన్ దేశానికి వెళ్లాడు. కరోనా భయంతో యువకుడు అక్కడే చిక్కుకుపోయాడు. ఆ దేశం ఉపాధి లేక స్వస్థలానికి వచ్చే అవకాశాలు లేకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు.

అయితే కొద్ది రోజుల కిందట కరోనా భయంతో స్వదేశానికి తిరిగి వస్తున్నానని కుటుంబీకులకు ఫోన్ చేసి చెప్పాడు. కాగా, కాంట్రాక్ట్ పూర్తి కాకుండా వస్తే జీతం ఇవ్వరని, కొంత డబ్బును వాళ్లకు కట్టాల్సి ఉంటుందని డబ్బులు పంపించాలని కుటుంబీకులను కోరాడు.

అయితే యువకుడి అక్క రత్నం తాను విమాన టికెట్ డబ్బులు సమకూరుస్తానని, మిగిలిన డబ్బులు ఎలాగోలా సర్దుబాటు చేసుకుని త్వరగా ఇంటికి వచ్చేలా ఏర్పాట్లు చేసుకోవాలని కోరింది. ఇక తన ఫోన్ అమ్మేసి డబ్బులు కట్టి వస్తానని మహేష్ చెప్పాడు. వారం రోజుల క్రితం ఫోన్ చేసి 22వ తేదీన విమాన టికెట్ కూడా తీసుకున్నానని, బయలుదేరి వచ్చేస్తానని కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు.

కాగా, 23న ఇండియన్ ఎంబసీ నుంచి మహేష్ కుటుంబీకులకు ఫోన్ వచ్చింది. మహేష్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.

ఇక ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మృతదేహాన్ని కూడా స్వస్థలానికి పంపించలేమని చెప్పడంతో కన్నీరుమున్నీరవుతున్నారు. చివరకు కన్నబిడ్డను చివరి చూపు చూసుకునే అవకాశం లేకపోవడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.

Next Story
Share it