పవన్‌ కల్యాణ్‌పై వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫైర్‌...

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  25 Nov 2019 1:45 PM GMT
పవన్‌ కల్యాణ్‌పై వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫైర్‌...

అధర్మం, అన్యాయం, దుష్టసంప్రదాయం...వీటిని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కొనసాగిస్తున్నారని విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఈ రోజు తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటుచేసి మాట్లాడారు. మతం అనేది జీవన విధానం, దేవుడి భక్తితోపాటు ధర్మం కూడా ఉండాలన్నారు. ఈ మధ్య కాలంలో పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతున్న తీరును చూస్తే భక్తితో, మతంతో రాజకీయం చేయాలని ఆటలాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. దైవభక్తి పాపభీతి లేనివారు,అసలు హిందుత్వంపై మాట్లాడే నైతిక హక్కు పవన్‌ కల్యాణ్‌కు ఉందా..? ఐదు సంవత్సరాల టీడీపీ పాలనను వదిలేసి ఐదునెలలు కూడా కాని మా పరిపాలనపై మాట్లాడే నైతిక హక్కు ఉందా? అంటూ మల్లాది ప్రశ్నించారు. పవన్‌ అరాచకవాదులుగా తయారయ్యారని, చంద్రబాబు పాలనలో హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా హిందుత్వంపై దాడి జరిగితే ఆరోజు బీజేపీ, టీడీపీ, జనసేనలు కలిసి ఉన్న ప్రభుత్వంలో మాట్లాడలేదన్నారు. 40 దేవాలయాలను కూలిస్తే నోరు ఎందుకు మెదపలేదని, అమ్మవారి దేవస్దానంలో క్షుద్రపూజలు చేస్తే ఎందుకు మాట్లాడలేదని ఆరోపించారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్‌ ఇచ్చి జీవో నెంబర్‌ 76ను అమలు చేయమని ఆదేశిస్తే దానిని అమలు చేయడానికి కనీసం ప్రయత్నిం కూడా చేయలేదన్నా విమర్శించారు.

అలాగే సదావర్తి భూములను టీడీపీ నేతలు నేతలు కాజేస్తుంటే మాట్లాడలేదని, పుష్కరాలలో 29 మంది చనిపోయినా,3 వేల కోట్ల రూపాయలు టీడీపీ నేతలు లూటీ చేసినా నోటీ నుంచి ఒక్క మాటకూడా మాట్లాడలేదన్నారు. ఇన్నిసార్లు నోరుమెదపని పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడు మాత్రం కేవలం చంద్రబాబు ఆదేశాల మేరకు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఐ సంవత్సరాలు మాట్లాడకుండా ఐదునెలల పాలనపై కులం, మతం గురించి మాట్లాడుతూ అరాచకవాదిలా పవన్‌ కల్యాణ్‌ తయారయ్యరని మండిపడ్డారు. 151 మంది ఎమ్మెల్యేలతో అధికారంలోకి వచ్చి, సీఎం జగన్‌ నేతృత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని అన్నారు. రైతుభరోసా, అమ్మఒడి, ఆరోగ్యశ్రీ, హైస్కూల్స్‌ స్దితిగతులను రూపురేఖలను మార్చాలని ప్రయత్నిస్తున్నారని, కార్మికులకు ఆదుకునేందుకు 10 వేల రూపాయలు అందచేశారని, మత్స్యకారులకు వేటకు వెళ్లని సమయంలో పదివేల ఆర్దిక సహాయం, అలాగే రైతులకు మద్దతు ధరలు లభించేలా చేసేందుకు ధరల స్దిరీకరణనిధి ఏర్పాటు చేశామన్నారు.

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మెనారిటీలకు నామినేటేడ్‌ పదవులు, వర్క్స్‌ లలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా అన్ని అమలు చేస్తూ వస్తుంటే, పవన్‌కల్యాణ్‌ మాత్రం తమపై బురదజల్లేందుకు నడుబిగించారని విమర్శించారు. రాష్ట్రంలో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లు కలిసి నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారని మల్లాది విష్టు దుయ్యబట్టారు. మీకు దమ్ముంటే మీరు చేసిన ట్వీట్లపై చర్చకు రావాలని మల్లాది పవన్‌కు సవాల్‌ విసిరారు. ఇలాంటి దేవాదాయ శాఖను, హిందూ మతాన్ని అడ్డం పెట్టుకుని ఈ సమాజాన్ని రాష్ట్రంలో విడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

Next Story