యూట్యూబ్‌లో చూసి మద్యం తయారీ.. అడ్డంగా బుక్కైన తల్లీకొడుకులు

By సుభాష్  Published on  20 April 2020 4:19 AM GMT
యూట్యూబ్‌లో చూసి మద్యం తయారీ.. అడ్డంగా బుక్కైన తల్లీకొడుకులు

దేశంలో కరోనా కారణంగా లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. దీంతో మందుబాబులకు మద్యం లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఏ కష్టాలు వచ్చిన తట్టుకుంటారేమో గానీ, మద్యం కష్టాలు వస్తే తట్టుకోలేరని చాలా మందికి తెలిసిన విషయమే. ఎందుకంటే మద్యానికి అలా బానిసైపోయారు కాబట్టి. కొందరు మద్యంలేక ఆత్మహత్యలకు పాల్పడుతుంటే, మరి కొందరు శానిటైజర్‌, ఆల్కహల్‌ ఉన్న వాటిని తాగుతూ ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. ఇక మద్యం ప్రియుల అవస్థలను ఆసరా చేసుకుంటున్న కొందరు మహానుభావులు కొత్త వ్యాపారంలోకి దిగుతున్నారు.

మందుబాబుల కష్టాలనే వ్యాపారంగా మార్చుకుంటున్నారు. ఏకంగా ఓ వ్యక్తి ఇంట్లో మద్యం తయారీని మొదలు పెట్టారు. యూట్యూబ్‌లో మద్యం ఎలా తయారు చేయాలో తెలుసుకున్న తల్లీకొడుకులు ఇంట్లోనే మద్యం తయారు చేస్తూ పోలీసులకు అడ్డంగా బుక్కైపోయారు. ఈ ఘటన హైదరాబాద్‌ ఉప్పల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రామాంతపూర్‌ చర్చికాలనీలో చోటు చేసుకుంది. పోలిశెట్టి సుధాకర్‌ అనే వ్యక్తి మద్యం ఎలా తయారు చేయాలో యూట్యూబ్‌లో వెతికి వెతికి తెలుసుకున్నాడు. ఇంకేముంది లాక్‌డౌన్‌ సమయంలో మంచి వ్యాపారం దొరికిందని భావించి తన తల్లితో కలిసి ఇంట్లో మద్యం తయారీని ప్రారంభించాడు.

ఇక ఈ మహానుభావుడు చేస్తున్న వ్యాపారం గురించి ఇనోటా.. ఆనోటా పోలీసుల వరకు వెళ్లింది. ఇక రంగంలోకి దిగిన పోలీసులు ఏకంగా ఇంటికెళ్లి పట్టుకున్నారు. దీంతో ఇంట్లో 25లీటర్ల మద్యం తయారీకి కావాల్సిన ముడి సరుకును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అందుకే మంచిదారిలో వెళ్లి అభివృద్ది చెందాలి తప్ప.. అక్రమంగా ఇలాంటి వ్యాపారాలు మొదలు పెడితే కటకటాల పాలయ్యే అవకాశలున్నాయి. తస్మాత్‌ జాగ్రత్త.

Next Story
Share it