మెగా హీరో కోసం రంగంలోకి దిగ‌నున్న‌ మ‌హేష్‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 Nov 2020 5:46 AM GMT
మెగా హీరో కోసం రంగంలోకి దిగ‌నున్న‌ మ‌హేష్‌

మెగాస్టార్‌ చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా వెండితెర‌కు ప‌రిచ‌య‌మ‌వుతున్న‌ చిత్రం ఉప్పెన. కీర్తీ శెట్టి హీ‌రోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. త్వరలోనే థియేటర్లలలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. ఈ చిత్రం ద్వారా క్రియేటివ్ డైరెక్ట‌ర్‌ సుకుమార్ అసిస్టెంట్‌ బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

ఈ సినిమాను సుకుమార్‌, మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. కాగా ఈ సినిమా నుంచి ఇప్పటికే రెండు పాటలు విడుదలవ్వగా ఇవి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన అందుకున్నాయి. ముఖ్యంగా ‘నీ కళ్లు నీలి సముద్రం’ పాట మ్యూజిక్‌ లవర్స్‌ను ఎంత ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ తర్వాత విడుదలైన ‘దక్‌ దక్‌ దక్‌’ పాట కూడా మాంచి హిట్‌ అయ్యింది.తాజాగా ఈ సినిమా నుంచి మూడో పాటను విడుదల చేయనున్నారు. సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు చేతుల మీదుగా.. ‘రంగులద్దుకున్న’ అనే పాటను మహేష్‌ బాబు నవంబర్‌ 11న సాయంత్రం 4.05 నిమిషాలకు విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.

Next Story