లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా జవసత్వాలు కోల్పోయినట్లుంది. అసలు పోరాటం చేయడాన్ని కూడా హస్తం పార్టీ మరిచిపోయినట్లుంది. రెండు కీలక రాష్ట్రాలకు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలే అందుకు ఉదాహరణ. మహారాష్ట్ర, హర్యానా శాసనసభ ఎన్నికలను కాంగ్రెస్ నాయకత్వం సీరియస్‌గా తీసుకో నట్లు కనిపిస్తోంది. అగ్రనాయకుల పర్యటనలు గానీ, పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచే ప్రసంగాలు గానీ కనిపించడం లేదు. ఏదో రాహుల్ గాంధీ తిప్పలు పడుతున్నా రు గానీ, సీనియర్లు మాత్రం పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఓవైపు అధికార బీజేపీ తరఫున ప్రధాని మోదీ, పార్టీ చీఫ్ అమిత్ షా, కేంద్రమంత్రులు, సీనియర్ నాయకులు పూర్తిస్థాయిలో ప్రచారం చేస్తుంటే కాంగ్రెస్ నాయకులు మాత్రం తమకేం పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు.

భారీ బహిరంగసభలు, రోడ్‌షోలతో కమల దళం హోరెత్తిస్తుంటే కాంగ్రెస్ ప్రచారం పేలవంగా సాగుతోంది. పైగా, ఎప్పుడో ముగిసిపోయిన నోట్ల రద్దు, జీఎస్టీ, రాఫెల్ ఒప్పందాల చుట్టూనే రాహుల్ గాంధీప్రసంగాలు సాగుతున్నాయి. వీటన్నింటిని లోక్‌సభ ఎన్నికల సమయంలోనే ప్రజలు పదే పదే విన్నారు. అన్నీ విని బీజేపీకే పట్టం కట్టారు. మరి, ఈ వాస్తవాన్ని రాహుల్‌ గాంధీ ఎందుకు అర్థం చేసుకోవడం లేదని ప్రత్యర్థులు సూటిగా ప్రశ్నిస్తున్నారు. పైగా, రాఫెల్ యుద్ధ విమానంపై రక్షణమంత్రి రాజ్‌నాధ్‌సింగ్ ఓంకారం రాయడాన్ని రాహుల్ ఎందుకు తప్పుబట్టారో ఆయనకే తెలియాలి. తాను జంధ్యం వేసుకున్న బ్రాహ్మణున్ని అని, కైలాసనాధ యాత్రకు వెళ్లానంటూ గుళ్లూ గో పురాలు తిరిగిన రాహుల్‌కు అప్పుడు మతం కనిపించలేదా అని కమలదళం కస్సుమంటోంది. ఓంకారంతో పని ప్రారంభించడం భారతీయత అన్న కనీస జ్ఞానం కూడా రాహుల్‌కు లేదా అని బీజేపీ నాయకులు చెడుగుడు ఆడుకుంటున్నారు. దీనికి కాంగ్రెస్ పార్టీ నుంచి సరైన కౌంటర్ కూడా లేదు.

ప్రచారంలో కనిపించని ప్రియాంక:

ఇక, కాంగ్రెస్ అగ్రనాయకత్వం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. పార్టీ తురుపుముక్కగా, భవిష్యత్ ఆశాజ్యోతిగా పేరొందిన ప్రియాంకా వాద్రా, రెండు రాష్ట్రాల ఎన్నికల్లో ఒక్కసారి కూడా కనిపించలేదు. పార్టీ నాయకులకు గానీ, పార్టీ కార్యకర్తలకు గానీ ముఖం కూడా చూపించలేదు. లోక్‌సభ ఎన్ని కల సమయంలో తెగ హడావుడి చేసిన ప్రియాంక, మహారాష్ట్ర-హర్యానా అసెంబ్లీ ఎన్నికల విషయానికి వచ్చే సరికి సైలెంట్‌గా ఉండిపోయారు. ఒక్కటంటే ఒక్క చోట కూడా ఆమె ప్రచారం చేయలేదు. పోటీ అన్నాక గెలుపోటములు సహజం. ఓడినా-గెలిచినా పార్టీ శ్రేణులకు అండగా ఉండడం, పార్టీని ముందుండి నడిపిం చడమే నాయకుల లక్షణం. మరి, ఈ సూక్తులు ప్రియాంకకు చెప్పేవారు లేనట్లుంది. అందుకే అప్పుడప్పుడూ మెరుపుతీగలా కనిపిస్తూ టక్కున మాయమైపోతు న్నారు.

ప్రచారానికి సోనియా దూరం:

కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ కూడా ప్రచారానికి దూరంగా ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల సమయంలోనే ఆమె ప్రచారం చేయలేదు. అనారోగ్య కారణాలతో ఆమె ఇంటిపట్టునే ఉండిపోయారు. మహారాష్ట్ర-హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే పరిస్థితి ఎదురైంది. వాస్తవానికి హర్యానాలోని మహేంద్రఘర్‌లో సోనియా సభ జరగాల్సి ఉంది. ఐతే, అనూహ్యంగా ఆమె పర్యటన రద్దైంది. సోనియా స్థానంలో రాహుల్‌ మాట్లాడారు. మ‌హారాష్ట్రలో కూడా సోనియా ర్యాలీ నిర్వహించాల్సి ఉండగా, అది కూడా అనుమానాస్పదంగా మారింది. మొత్తానికి తల్లీబిడ్డలు దూరంగా ఉండడంతో కుమారుడు ఒక్కడే తన వంతుగా పోరాడుతున్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.