మహారాష్ట్ర అంటే భయపడుతున్న తెలంగాణ
By సుభాష్ Published on 12 April 2020 1:15 AM GMTదేశంలో కరోనా కోరలు చాస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. దేశంలో ముందుగా నెమ్మదిగా పెరిగిన కరోనా కేసులు ఢిల్లీ మర్కజ్ ప్రార్థనల ఉదాంతం తర్వాత ఒక్కసారిగా పెరిగిపోయాయి. లాక్‌డౌన్ ఉన్న దేశంలో నిబంధనలు మరింత కఠనతరం చేశారు.
ఇక అన్ని రాష్ట్రాల్లో కంటే మహారాష్ట్రలో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా భారీగానే ఉంటుంది. అందులో ముంబైలో కూడా కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. మహారాష్ట్ర ఇప్పుడు తెలంగాణను టెన్షన్ పెడుతోంది. చాలా పొడవైన సరిహద్దు ఉన్నమహారాష్ట్ర నుంచి తెలంగాణకు మళ్లీ కొత్త కేసులు వస్తాయేమోననే టెన్షన్ మొదలైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తూ, మహారాష్ట్రలో శనివారం ఒక్కరోజే 11 మంది మృతి చెందారని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సరిహద్దును కూడా మూసివేస్తామని స్పష్టం చేశారు కేసీఆర్. లేకపోతే ముందు ముందు మరిన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
మహారాష్ట్ర సరిహద్దుకు ఈ జిల్లాలే..
తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు మహారాష్ట్ర సరిహద్దు ఉంది. అక్కడి నుంచి తెలంగాణకు వస్తు రవాణా భారీగానే ఉంటుంది. ఈ అంశంపై కూడా తెలంగాణ సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. ఇదొక్క రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాల సరిహద్దుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. మున్ముందు పెద్ద ముప్పు సంభవించకుండా ఉండాలంటే కొన్ని నిబంధనలు కఠితరం చేయకతప్పదని కేసీఆర్ స్పష్టం చేశారు.
నిన్నటి వరకూ దేశ వ్యాప్తంగా 6412 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 199 మంది మరణించారు. ఇతర దేశాల్లో కూడా పాజిటివ్ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య భారీగానే ఉంది. ఇక అగ్రరాజ్యమైన అమెరికాను సైతం కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తోంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను సైతం కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఎంతో సాంకేతికంగా అభివృద్ధి చెందిన అమెరికాలో మృతుల సంఖ్య కుప్పలు తెప్పలుగా చేరుతున్నాయి. అమెరికాలో రోజురోజుకు వెయ్యి మందికిపైగా మృతి చెందుతుంటే.. ఈ నెల 7వ తేదీ నుంచి ప్రతీరోజు రెండు వేల చొప్పున కరోనాతో మృతి చెందుతున్నారు.